తెలంగాణకు మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు కల త్వరలో సాకారం కానుంది. రంగారెడ్డి జిల్లా యాచారం, కందుకూరు మండలాల్లో ప్రభుత్వం చేపడుతున్న హైదరాబాద్ ఔషధ నగరి శంకుస్థాపనకు రంగం సిద్ధమైంది. పర్యావరణ అనుమతులు లభించడంతోపాటు మొదటిదశ భూసేకరణ దాదాపు పూర్తికావడంతో దీని నిర్మాణానికి మార్గం సుగమమయింది. త్వరలోనే దీనికి భూమి పూజ జరిగే అవకాశం ఉంది. ఔషధ, వైద్య రంగాలకు సంబంధించి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టుగా దీన్ని నిర్మించేందుకు ప్రభుత్వం పూనుకుంది. 78.23 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 19,333 ఎకరాల్లో రూ.16,784 కోట్ల వ్యయంతో ఔషధ నగరిని నిర్మించి, 5.6 లక్షల మందికి ఉపాధి కల్పించాలని ప్రణాళిక రూపొందించింది. ఇందుకోసం రూ.64 వేల కోట్ల పెట్టుబడుల సమీకరణ, రూ.58 వేల కోట్ల ఎగుమతులు జరిపేలా లక్ష్యం నిర్దేశించుకుంది. దీనికి కేంద్రం జాతీయ పెట్టుబడులు, ఉత్పాదక మండలి (నిమ్జ్) హోదా కల్పించింది. ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే 8500 ఎకరాల భూసేకరణ జరిగింది. మరో 1500 ఎకరాల భూసేకరణ ప్రక్రియ నడుస్తోంది. మొదటి దశ కింద భూసేకరణ పూర్తయింది. గత సెప్టెంబరు ఆరో తేదీన కేంద్ర పర్యావరణ, అటవీశాఖ దీనికి పర్యావరణ అనుమతులు మంజూరు చేసింది. ఆ తర్వాత భూసేకరణ ప్రక్రియను రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్‌ఐఐసీ) కొనసాగించింది. రాష్ట్రంలో ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం ఏర్పడింది. దీంతో శంకుస్థాపన చేసి, నిర్మాణ పనులను పూర్తిస్థాయిలో చేపట్టాలని యోచిస్తోంది. మంత్రివర్గ విస్తరణ తర్వాత ఈ కార్యక్రమం జరిగే అవకాశంఉంది. లేని పక్షంలో పార్లమెంటు ఎన్నికల తర్వాత చేపడతారని తెలిసింది.
ప్రాజెక్టులో భాగంగా శ్రీశైలం రహదారి వైపు నాలుగు వరుసల రహదారి పనులు పూర్తి కావచ్చాయి. దీంతోపాటు టీఎస్‌ఐఐసీ అంతర్గత రహదారుల నిర్మాణం చేపట్టింది. విద్యుత్ సబ్‌స్టేషన్ పూర్తయింది. నీటి సరఫరా పైపులైన్ పనులు సాగుతున్నాయి. కేంద్ర పర్యావరణశాఖ ఆదేశాలకు అనుగుణంగా కేంద్రీకృత వ్యర్థాల శుద్ధి కేంద్రం, ఇతర చర్యల కోసం ప్రత్యేక ప్రణాళికను టీఎస్‌ఐఐసీ సిద్ధం చేస్తోంది. అలాగే అంతర్జాతీయ స్థాయిలో మౌలిక వసతులకోసం ప్రత్యేక ప్రణాళికను తయారు చేయించాలని టీఎస్‌ఐఐసీ నిర్ణయించింది. దీనికోసం త్వరలోనే టెండర్లు పిలవనుంది.