న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గ్రాఫ్ రోజురోజుకు పడిపోతోంది. ఇటీవలి పలు సర్వేల్లో ఆయన పనితీరుపై ప్రజల నాడి వెల్లడవుతోంది. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కేంద్రంలో కొత్త నాయకత్వం రావాల్సిన అవసరం ఉందని, కరోనా రెండో దశ నియంత్రణలో వైఫల్యానికి మోడీ ప్రభుత్వ తీరే కారణమని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. దేశ ప్రధానిగా గతేడాది ఆగస్టులో మోడీకి 66 శాతంగా ఉన్న మద్దతు.. ఈ ఏడాది ఆగస్టుకు వచ్చే సరికి 24 శాతానికి పడిపోయిందని ఇండియా టుడే నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్(ఎంఒటిఎన్) సర్వేలో వెల్లడైన విషయం తెలిసిందే. అదేవిధంగా ‘యుగవ్-మింట్-సిపిఆర్ మిలీనియల్’ తాజా సర్వేలోనూ మోడీ పనితీరు పట్ల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రంలో కొత్త నాయకత్వం రావాల్సిన అవసరం ఉందని సర్వేలో పాల్గొన్న 46 శాతం అభిప్రాయ పడ్డారు. గత కొన్ని నెలలుగా మోడీ ప్రభుత్వ పనితీరు దారుణంగా ఉందని 53 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశంలో సంభవించిన ఆరోగ్య విపత్తు, తదనంతర కరోనా రెండో దశకు మోడీనే బాధ్యత వహించాలని 42 మంది ఈ సర్వేలో స్పష్టంచేశారు. ఈ యుగవ్-మింట్ సర్వే జూన్, జులై నెలల్లో 203 నగరాల్లోని 10,285 మందిని సంప్రదించింది. కరోనా రెండో దశలో తీవ్రంగా ప్రభావితమైన గ్రామీణ ప్రాంతాల ప్రజలను ఈ సర్వే పలుకరించకలేదు. దీంతో ప్రభుత్వ పనితీరుపై వ్యతిరేకత ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.