అబుదాబీ : ఐసిసి పొట్టి ప్రపంచ కప్ షెడ్యూల్ విడుదలైంది. అక్టోబర్ 17 నుండి నవంబర్ 14 వరకు టీ 20 ప్రపంచ కప్ జరగనుంది. ఒమన్‌తో పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఈ టోర్నీలను నిర్వహించనున్నారు. నవంబర్ 10,11 తేదీల్లో సెమీ ఫైనల్, నవంబర్ 14న ఫైనల్ మ్యాచులు జరగనున్నాయి. సెమీస్, ఫైనల్ మ్యాచులకు రిజర్వు డే కేటాయించారు. అక్టోబర్ 24న భారత్-పాక్ మధ్య మ్యాచ్ జరగనుంది. తొలి రౌండ్‌లో గ్రూప్-బి నుండి తొలి పోరు ఉంటుంది. అక్టోబర్ 17న మధ్యాహ్నం మ్యాచులో ఒమన్, పపువా న్యూగిని తలపడతాయి. సాయంత్రం మ్యాచులో స్కాట్లాండ్, బంగ్లాదేశ్ ఢీ కొంటాయి. ఆ తర్వాతి రోజు గ్రూప్ -ఎలోని ఐర్లాండ్, నెదర్లాండ్స్, నమీబియా, శ్రీ లంక అబుదాబిలో పోటీ పడతాయి. సూపర్ 12 మ్యాచులు అక్టోబర్ 23 నుండి మొదలవుతాయి.
సూపర్-12లో అబుదాబి వేదికగా గ్రూప్-1లోని ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా అక్టోబర్ 23న బరిలోకి దిగుతాయి. అదే రోజు సాయంత్రం దుబాయ్‌లో జరిగే మ్యాచులో ఇంగ్లాండ్, వెస్టిండీస్‌లు తలపడతాయి. ఆసీస్, ఇంగ్లాండ్ పోరు అక్టోబర్ 30న జరుగుతుంది. గ్రూప్-2లో అతిపెద్ద మ్యాచ్ అక్టోబర్ 24న భారత్,పాక్‌ల మధ్య రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. అబుదాబిలో నవంబర్ 10న తొలి సెమీస్, దుబాయ్ లో 11న రెండో సెమీస్ ఉంటాయి. నవంబర్ 14 ఆదివారం దుబాయ్‌లో ఫైనల్ పోరు ఉంటుంది.