వాషింగ్టన్ : ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌కు తాజాగా 3,000 మంది సైనికులను అమెరికా పంపిస్తోంది. కాబూల్‌లోని అమెరికన్ ఎంబసీని పాక్షికంగా ఖాళీ చేయించేందుకు వీరు సహకరిస్తారు. ఆఫ్ఘనిస్థాన్ అత్యంత వేగంగా తాలిబన్ల నియంత్రణలోకి వెళ్తుండటంతో అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది.
తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్ రెండో అతి పెద్ద నగరం కాందహార్‌ను స్వాధీనం చేసుకోవడంతో ఆ దేశ ప్రభుత్వ సమర్థతపై నమ్మకం తగ్గిపోయింది. ఫలితంగా అమెరికన్ స్టేట్ డిపార్ట్మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. కాబూల్‌లోని అమెరికన్ ఎంబసీని పాక్షికంగా ఖాళీ చేయించాలని నిర్ణయించింది. ఎంబసీ కార్యకలాపాలు కొనసాగుతాయని తాజాగా ప్రకటించింది. అమెరికన్ స్టేట్ డిపార్ట్మెంట్ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ మాట్లాడుతూ, ఇది అర్ధాంతరంగా వదిలిపెట్టడం కాదని, పూర్తిగా ఖాళీ చేయించడం కాదని చెప్పారు. సిబ్బంది సంఖ్యను తగ్గించడమని వివరించారు.
ఆఫ్ఘనిస్థాన్‌లో అమెరికా మిషన్‌కు ఈ నెల 31తో తెరపడబోతోంది. దళాలను పూర్తిగా ఉపసంహరించుకోవడం పట్ల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కచ్చితంగా వ్యవహరిస్తున్నారు. కాబూల్ విమానాశ్రయానికి అదనంగా దళాలను పంపించాలని ఆదేశించారు. అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్, డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్ ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీతో మాట్లాడారు.