లక్నో : ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సోమవారం ఇక్కడ సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ తో భేటీ అయ్యారు. ఈ సమావేశం ఫొటోను ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ట్వీట్ చేశారు. ‘ములాయం సింగ్తో భేటీ అయ్యా. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నా. ఒకరికొకరం చర్చించుకున్నాం. దేశంలో జరుగుతున్న ఆందోళనలు, వ్యవసాయం, రైతులు, పేదలు, నిరుద్యోగం గురించి మాట్లాడుకున్నాం. వాటిపై పోరాటాలు కూడా చేస్తాం’’ అని లాలూ ప్రసాద్ ట్వీట్ చేశారు. జైలు నుంచి విడుదలైన తర్వాత లాలూ ప్రసాద్ యాదవ్ రాజకీయంగా క్రియాశీలం అవుతున్నారు. కొన్ని రోజుల కిందట పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు.