కర్నూలులో మూడు స్తంభాలాట

కర్నూలులో మూడు స్తంభాలాట

కర్నూలు: జిల్లా రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. కోట్ల కుటుంబం తెదేపాలోకి వస్తుండడంతో జిల్లాలో బలమైన కేఈ కుటుంబం ఏవిధంగా స్పందిస్తుంది? కర్నూలు ఎంపీ బుట్టా రేణుక భవిష్యత్‌ ఏమిటి? అనే అంశంపై తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. దీనికి సీఎం చంద్రబాబు మంచి పరిష్కారం చూపుతారని నాయకులు ధీమా వ్యక్తంచేస్తున్నారు. కర్నూలు జిల్లాలో బలమైన నేతగా గుర్తింపు పొందిన నేత కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి. కాంగ్రెస్‌ పార్టీ తీరుపై అసంతృప్తితో ఉన్న ఆయన.. కుటుంబ సభ్యులతో కలిసి సీఎం చంద్రబాబును కలిశారు. సుదీర్ఘ మంతనాలు జరిపారు. తెదేపాలో చేరిన తర్వాత జిల్లాలో రాజకీయ పరిణామాలు ఏవిధంగా మారుతాయనే అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. జిల్లాలో కేఈ, కోట్ల కుటుంబాల మధ్య రాజకీయ వైరం ఉంది. కేఈ తెదేపాకు ప్రాతినిధ్యం వహిస్తుండగా.. కోట్ల కాంగ్రెస్‌కు పెద్దన్నగా మెలిగారు. కోట్ల తెదేపాలోకి వస్తే ఈ కుటుంబాలు కలిసి పనిచేస్తాయా? వీరి మధ్య సమన్వయం ఉంటుందా? అనే అంశాలపై జిల్లాలో చర్చ జరుగుతోంది. కోట్ల కుటుంబం కర్నూలు ఎంపీ స్థానంతో పాటు డోన్‌, ఆలూరు, కోడూమూరు అసెంబ్లీ స్థానాలను ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. డోన్‌ నియోజకవర్గాన్ని వదులుకునేందుకు కేఈ కుటుంబం సిద్ధంగా లేదు. మిగిలిన స్థానాల్లో తమకేమీ అభ్యంతరం లేదని కేఈ వర్గీయుల నుంచి సంకేతాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ కర్నూలు లోక్‌సభ నియోజకవర్గాన్ని కేటాయిస్తే ప్రస్తుత ఎంపీ బుట్టా రేణుక పరిస్థితి ఏమిటన్నది సందిగ్ధంలో పడింది. వైకాపా నుంచి తెదేపాలోకి వచ్చిన కోడుమూరు శాసన సభ్యుడు మణిగాంధీ, ఆలూరు తెదేపా బాధ్యుడు వీరభద్రగౌడ్‌లను ఏవిధంగా బుజ్జగిస్తారు? అనేదానిపై చర్చ జరుగుతోంది. వీటన్నింటికీ సీఎం చంద్రబాబే సమాధానం చెబుతారని.. అందరికీ సమన్యాయం చేస్తారనే మాట తెలుగుదేశం పార్టీ నుంచి వినిపిస్తోంది.

2014 సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా నుంచి కర్నూలు ఎంపీగా బుట్టా రేణుక గెలుపొందారు. ఆ తర్వాత తెదేపాలో చేరారు. అప్పుడు సీఎం స్పష్టమైన హామీలు ఇచ్చారని బుట్టా వర్గీయులు చెబుతున్నారు. ఈ మధ్య కాలంలోనే కర్నూలు పర్యటనకు వచ్చిన తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ కర్నూలు ఎంపీ అభ్యర్థిగా బుట్టా రేణుక పేరును ప్రకటించారు. ఓ వైపు పార్టీ జాతీయాధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి ఇద్దరూ తమకు హామీ ఇచ్చారని రేణుక ధీమా వ్యక్తంచేశారు. సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉన్నామని ఎంపీ చెబుతున్నారు.

మరోవైపు సీట్ల విషయంలో చర్చలు కొలిక్కి వచ్చిన వెంటనే కోట్ల పచ్చ కండువాను కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. దీంతో అసంతృప్తులను సంతృప్తి పరిచేందుకు సీఎం ఏం చేస్తారు? అనే విషయంపైనా ఆసక్తి నెలకొంది. ఓ బలమైన రాజకీయ కుటుంబం తెదేపాలోకి రావడంతో పార్టీ బలోపేతమవుతుందని, అదే సమయంలో కోట్ల కుటుంబానికి లాభిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos