సూరత్ : సొంతింటి కోసం యువత కనే కలలు పెద్ద నోట్ల రద్దు వల్ల సాకారమవుతున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేయడం వల్ల ఇళ్ళ దరలు తగ్గాయన్నారు. తాను ఇప్పటి వరకు చేసిన పనులను గత ప్రభుత్వాలు చేయాలంటే, వారికి మరో పాతికేళ్లు పట్టి ఉండేదన్నారు. గుజరాత్‌లోని సూరత్ విమానాశ్రయంలో నూతన టెర్మినల్ విస్తరణకు మోదీ శంకుస్థాపన చేశారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. ‘‘పెద్ద నోట్ల రద్దు వల్ల ఏం లాభం జరిగిందని నన్ను అడుగుతూ ఉంటారు. ఈ నిర్ణయం తర్వాత సరసమైన ధరలకు ఇళ్ళు కొనుక్కున్న యువతను ఈ ప్రశ్న అడగాలి. నల్ల ధనాన్ని రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టేవారు. కానీ నోట్ల రద్దు వంటి నిర్ణయాలను తీసుకోవడం వల్ల దానికి అడ్డుకట్ట పడింది’’ అని చెప్పారు. నాలుగేళ్ళ ఎన్డీయే పాలనలో 1.30 కోట్ల ఇళ్లను నిర్మించినట్లు తెలిపారు. యూపీయే ప్రభుత్వం కేవలం 25 లక్షల ఇళ్ళను మాత్రమే నిర్మించిందని తెలిపారు. గత 30 ఏళ్ళలో హంగ్ పార్లమెంటు ఉండటం వల్ల దేశాభివృద్ధిపై ప్రభావం పడిందన్నారు. నాలుగేళ్ళ క్రితం ప్రజలు తమకు పూర్తి ఆధిక్యత ఇవ్వడం వల్ల దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు.
ఒడిశాలోని భువనేశ్వర్ ఎయిర్పోర్ట్ వద్ద కిందపడిన ఫోటోగ్రాఫర్‌కు రాహుల్ గాంధీ చేయి అందించి పైకిలేపిన సంఘటన ఇంకా స్మృతిపథంలో ఉండగానే దాదాపు అదే తరహా సంఘటన ప్రధాని మోదీ గుజరాత్ పర్యటనలో బుధవారంనాడు చోటుచేసుకుంది. సూరత్‌లో జరిగిన పబ్లిక్ మీటింగ్‌లో మోదీ మాట్లాడుతుండగా ఆ ఈవెంట్‌ను కెమెరాలో బంధించేందుకు వచ్చిన కెమెరామన్ కిషన్ రమోలియా పొరపాటున కాలుజారి ఫ్లాట్‌ఫాం నుంచి కింద పడిపోయారు. దీంతో ప్రధాని తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేశారు. అతన్ని వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లాలంటూ వేదికపై నుంచే ఆదేశాలిచ్చారు. దీంతో కార్యకర్తలు, భద్రతా సిబ్బంది రమోలియాను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అనంతరం ప్రధాని తన ప్రసంగాన్ని కొనసాగించారు. ప్రధాని తన ప్రసంగాన్ని మధ్యలో ఆపడం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది, ఈశాన్య రాష్ట్రాల ఘనవిజయంపై న్యూఢిల్లీ ప్రధాన కార్యాలయంలో ప్రసంగిస్తున్న సమయంలో ఆ సమీపంలోని మసీదు నుంచి ‘అజాన్’ (ఇస్లాం ప్రార్థన) వినపడగానే ఆయన తన ప్రసంగాన్ని ఆపేసి, రెండు నిమిషాలు మౌనం పాటించారు.