ముంబై: బీజేపీతో కలిసి ఉండాలో లేదోనన్న సంగతి తనకు వదిలేయాలనీ… సిట్టింగ్ ఎంపీలంతా తమ నియోజకవర్గాల్లోని రైతు సమస్యలపై పోరాటం చేయాలని శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే తన పార్టీ శ్రేణులను ఆదేశించారు. ప్రజా క్షేమమే శివసేనకు పరమావధి అని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు థాకరే చెప్పిన విషయాలను ఆయన సన్నిహితుడు హర్షల్ ప్రధాన్ మీడియాకు వెల్లడించారు. బంద్రాలోని తన నివాసం మాతోశ్రీలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ‘‘ఈ సారి ఎన్నికల్లో శివసేన తన శక్తిమేర పోరాడుతుంది. సిట్టింగ్ ఎంపీలంతా తమ నియోజకవర్గాల్లోని సమస్యలపై పోరాడాలి. బీజేపీతో పొత్తు అంశం నాకు వదిలేయండి. ఒకవేళ తాము మళ్లీ గెలుస్తామన్న నమ్మకం ఎంపీలకు లేకపోతే.. ఇతరులకు పోటీచేసే అవకాశం ఇవ్వాలి…’’ అని థాకరే చెప్పినట్టు ప్రధాన్ వెల్లడించారు. రైతు రుణాల మాఫీ, పంట బీమా చెల్లింపులు జరిగాయా లేదా అన్న దానిపై క్షేత్రస్థాయిలో సమీక్షించాలని శివసేన ఎంపీలను థాకరే ఆదేశించారు. కాగా తమతో పొత్తు పెట్టుకునే దిశగా బీజేపీ ఇంత వరకు థాకరేకి ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ప్రధాన్ పేర్కొన్నారు. గతేడాది బీజేపీ చీఫ్ అమిత్‌షా ఉద్ధవ్ థాకరేని కలుసుకునేందుకు మాతోశ్రీకి వచ్చారనీ.. అయితే ఆ తర్వాత మళ్లీ ఎలాంటి సమాచారం లేదని ఆయన తెలిపారు. కాగా లోక్‌సభ ఎన్నికల్లో తాము బీజేపీతో కలవబోమనీ… ఒంటరిగానే పోటీచేస్తామని గతేడాదిలోనే శివసేన తెగేసి చెప్పిన సంగతి తెలిసిందే.