పుణె: మహీంద్రా ట్రక్ అండ్ బస్ ఫ్యూరియో సరికొత్త మధ్య శ్రేణి వాణిజ్య వాహనాన్ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీనిని గత ఏడాది ఆవిష్కరించింది. నేడు ఆ వాహనాన్ని మార్కెట్లోకి విడుదల చేసింది. దీనిలో 12టన్నుల శ్రేణి వాహనం ధర రూ.17.45లక్షలు, 14టన్నుల శ్రేణిలోని వాహనం ధర రూ.18.10లక్షలుగా నిర్ణయించారు. ఈ వాహన డిజైన్‌ను మహీంద్రా ఇటాలియన్ డిజైన్ హౌస్ పినిన్ఫరియాలో తయారు చేశారు. దీనిపై మహీంద్రా దాదాపు రూ.600 కోట్లు పెట్టుబడి పెట్టింది. 2014 నుంచి ఈ ప్రాజెక్టులో 500 మంది ఇంజినీర్లు, 180 సప్లైయర్లు భాగస్వాములయ్యారు. ఫ్యూరియో రేంజి ట్రక్కులను చకన్‌లోని మహీంద్రా ప్లాంట్‌లో తయారు చేస్తున్నారు. ఈ విభాగంలో ఐషర్, టాటా మోటార్స్‌కు గట్టి పోటీ ఇవ్వనుంది.ఈ సరికొత్త ట్రక్కులో సురక్షితమైన, సౌకర్యవంతమైన క్యాబిన్‌లు ఉన్నాయి. దీనిలో సరికొత్త ఎండీఐ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 2400 ఆర్‌పీఎం వద్ద 500 ఎన్‌ఎం టార్క్, 138 బీహెచ్‌పీ శక్తిని విడుదల చేస్తుంది. దీనిలో ఫ్యూయల్ స్మార్ట్ టెక్నాలజీని వినియోగించారు. ఫలితంగా లోడ్‌ను బట్టి డ్రైవ్ మోడ్‌ను ఎంచుకొనే అవకాశం ఉంది.