యుద్ధ ట్యాంక్‌లు ఎలా వాడాలోతెలీదు

యుద్ధ ట్యాంక్‌లు ఎలా వాడాలోతెలీదు

బీజింగ్‌: చైనా తయారు చేసిన యుద్ధ ట్యాంకులను ఆ దేశ  సైనికులే వినియోగించలేకపోతున్నారు. ఈ విషయాన్ని చైనాకు చెందిన గ్లోబల్‌టైమ్స్‌ పత్రిక, చైనా సెంట్రల్‌ టెలివిజన్‌లు వెల్లడించాయి.  ఈ ట్యాంక్‌లు సాంకేతికంగా ఎంతో ఉన్నత స్థాయికి చెందినవి కావడంతో వీటి వినియోగం సైనికులకు అర్థంకావడం లేదని పేర్కొంది. చైనాకు చెందిన ఎలైట్‌ ఆర్మ్‌డ్‌ బ్రిగేడ్‌ ది టైప్‌ 99ఏ రకం యుద్ధ ట్యాంకులను తొలిసారి నడిపాయి. అప్పట్లో జరిగిన ఓ పోరాటంలో పాత ట్యాంకులతో ఇవి తలపడ్డాయి. టైప్‌ 99ఏ ట్యాంక్‌లు పూర్తిగా డిజిటల్‌ తరహావి. కొత్త ట్యాంక్‌ల మధ్య బలమైన కమ్యూనికేషన్‌ వ్యవస్థలు ఉన్నాయి. శత్రువుకు కనపడకుండా దాడి చేయగల (బియాండ్‌ విజువల్‌ రేంజి అటాక్‌) సామర్థ్యం ఉంది. కానీ ఈ యుద్ధవిన్యాసాల్లో ఈ ట్యాంక్‌లను నమ్ముకొన్న దళం పూర్తిగా వెనుకబడిపోయింది. శత్రువుకు తేలిగ్గా దొరికిపోయాయి. ‘‘చాలా సందర్భాల్లో ఈ ట్యాంక్‌లు శత్రువులకు బాగా దగ్గరకు వెళ్లిపోయాయి. యుద్ధతంత్రంలో ఇది ఏమాత్రం క్షేమం కాదు. ఈ ట్యాంక్‌ల పనితీరుపై అవగాహన లేక  ఇలా జరిగింది’’ అని చైనా సెంట్రల్‌ టెలివిజన్‌ పేర్కొంది.‘‘మేము మా పాతట్యాంక్‌ల గురించే అధ్యయనం చేశాము. కొత్త ట్యాంక్‌ల పనితీరుపై పూర్తి అవగాహనలేదు’’ అని ఝా జినక్సన్‌ అనే కమాండర్‌ తెలిపారు. కేవలం అత్యాధునిక ఆయుధాలు ఉండగానే సరిపోదు.. వాటిని తెలివిగా ఉపయోగించగల సమర్థవంతమైన ఆపరేటర్లు కూడా కావాలి. వీళ్లే యుద్ధాల్లో కీలక పాత్ర పోషిస్తారు. ఇటీవల చైనా ఇబ్బడిముబ్బడిగా అత్యాధునిక ఆయుధ సంపత్తిని పోగేసుకొంటోంది. కానీ అక్కడ  వాటిని ఉపయోగించే నిపుణుల కొరత ఉన్న విషయం టైప్‌99 ట్యాంక్‌లతో వెలుగులోకి వచ్చింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos