న్యూ ఢిల్లీ: సామాజిక మాధ్యమాల్లో సమాచారంపై నియంత్రణకు కేంద్రం బుధవారం నుంచి అమలు చేస్తున్న కొత్త ఐటీ నిబంధనలను వాట్సాప్ దిల్లీ హైకోర్టు లోసవాలు చేసింది. కొత్త నిబంధనల అమలును తక్షణమే నిలిపివేయాలని కోరింది. కొత్త నిబంధనలు వినియోగదార్ల వ్యక్తిగత గోపత్యకు ముప్పు కలిగిస్తాయని పేర్కొంది. కొత్త నిబంధనల ప్రకారం.. దేశ సార్వభౌమత్వానికి, రక్షణకు సంబంధించిన కీలకాంశాలకు సంబంధించిన ఏదైనా సమాచారాన్ని లేదా ప్రజల భద్రతకు హాని కలిగించేలా తప్పుడు పోస్టులు పెట్టిన వారి వివరాల్ని సదరు సామాజిక మాధ్యమ సంస్థలు ప్రభుత్వానికి తెలపాలి. భారత రాజ్యాంగం ప్రకారం.. ఇది వ్యక్తుల గోప్యత హక్కులను ఉల్లంఘించినట్లనేది వాట్సాప్ వాదన. వాట్సాప్లో ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ సందేశాలు ఉంటాయి.ఒకవేళ కొత్త ఐటీ నిబంధనలను అనుసరిస్తే ఆ ఎన్క్రిప్షన్ను పక్కన పెట్టాల్సి ఉంటుందని పేర్కొంది. కొత్త నిబంధనల్ని అమలు చేస్తామని వాట్సాప్ మాతృ సంస్థ ఫేస్ బుక్ చెప్పడం గమనార్హం.