న్యూఢిల్లీ : వాడిన మాస్క్ను ఉతకకుండా మరోసారి వాడితే ఫంగస్ బారినపడతారని వైద్య నిపుణులు హెచ్చరించారు. అపరిశుభ్రమైన, ఉతకని మాస్క్ను ధరించే వారికి ఈ ప్రమాదం పొంచి ఉంటుంది. బ్లాక్ ఫంగస్ వ్యాధికి ఇది కూడా ఒక కారణం కావచ్చున్నారు. గాలి ప్రసరించని, వెలుతురు సోకని గదుల్లో నివసించడం కూడా సరికాదని చెప్పారు. మ్యుకోర్మైకోసిస్ లేదా బ్లాక్ ఫంగస్ వ్యాధితో బాధపడుతున్నవారి చరిత్రను పరిశీలించినపుడు వారు ఉతకని మాస్క్లను ఎక్కువ సమయం వాడినట్లు, చాలా అపరిశుభ్రమైన వాతావరణంలో నివసించినట్లు వెల్లడైందని ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ సురేశ్ సింగ్ తెలిపారు. హేతు బద్ధంకాని రీతిలో స్టెరాయిడ్లను వాడటం ప్రధాన కారణం. మాస్క్లను ఉతకకుండా ఎక్కువ సమయం వాడటం, బేస్మెంట్లు, తక్కువ గాలి ప్రసరించే చోట ఉండటం వంటివాటి వల్ల కూడా ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది. బ్లాక్ ఫంగస్ సోకిన రోగులను పరిశీలించినపుడు, వారు తమకు ఆక్సిజన్ కాన్సంట్రేషన్ లెవెల్స్ తగ్గినపుడు తమంతట తాము స్టెరాయిడ్స్ మెడికేషన్ తీసుకున్నట్లు తెలిసింది. బ్లాక్ ఫంగస్ ఇతరుల కన్నా ఎక్కువగా కోవిడ్-19కు చికిత్స పొందుతున్న, రికవరీ అవు తున్నవారిలోకనిపిస్తోందన్నారు. కాబట్టి మాస్క్లను తప్పనిసరిగా ప్రతి నిత్యం ఉతుక్కోవాలి. స్టెరాయిడ్లను తీసుకునేవారు తమ రక్తంలో చక్కెర స్థాయిని తనిఖీ చేసుకోవాలి.