హైదరాబాదు: తాజా పరిణామాలపై న శ్రేయోభిలాషులు, పార్టీ నాయకులతో చర్చిస్తున్నట్లు నని మాజీ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ‘నేను ఏ నిర్ణయం తీసుకున్నా నా వెంటే ఉంటామని కార్యకర్తలు భరోసా ఇచ్చార’న్నారు. బుధవారం ఇక్కడ ఆయన విలేఖరులతో మాట్లాడారు. ‘మిగిలిన జిల్లాల ప్రజలు కూడా వచ్చి నాతో మాట్లాడారు. నాకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. నాకు కొన్ని వేల ఫోను కాల్స్ వచ్చాయి. విదేశాలవీ ఉన్నాయి. నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన వారి అభిప్రాయాలను తీసుకున్నాను. కరోనా నుంచి జాగ్రత్తగా ఉండాలని కొందరు సలహా ఇచ్చారు. కొందరు 20 ఏళ్ల ఉద్యమ ఘట్టాలను గుర్తు చేశారు. నాకు జరిగిన అన్యాయం భరించరానిదని అభిప్రాయపడ్డారు. నేను ఏ నిర్ణయం తీసుకున్నా నా వెంటే ఉంటామని కార్యకర్తలు భరోసా ఇచ్చారు. తెలంగాణ ప్రజలు ఏం కోరుకున్నారో. వారు ఏం ఆశించారో వారి కల నెరవేరాక వారికి ఏం జరుగుతోందో మీకు తెలుసు. అన్నింటి కంటే ముఖ్యంగా ఆత్మగౌరవ సమస్య ఏర్పడింది. తెలంగాణలో చాలా ఘోరమైన పరిస్థితులు తలెత్తుతున్నాయి. నాకు సంబంధించి ఏదైనా సమస్య తలెత్తితే నేనే నేరుగా మీడియాకు తెలుపుతాను. ఇతరులు నా గురించి ఇచ్చే సమాచారాన్ని మాత్రం నమ్మకండ’ విన్నవించారు.