రోహతక్: ‘కరోనా మరణాల సంఖ్య పై చర్చలతో వారిని తిరిగి బతికించలేము. దానికి బదులు ప్రస్తుతం కరోనాతో బాధ పడుతున్నవారిని పట్టించుకోవడంపై శ్రద్ధ పెట్టాల’ని హరియాణా ముఖ్యమంత్రి మనోహర్లాల్ ఖట్టర్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వాలు చెబుతున్న లెక్కలకు, వాస్తవ మరణాల లెక్కలకు పొంతన కుదరడంలేదన్న విమర్శలకు ఈ మేరకు స్పందించారు. ఎవరూ ఇలాంటి సంక్షోభాన్ని ఊహించలేదు. దీన్ని ఎదుర్కోవడానికి కలిసికట్టుగా పనిచేయడమే మార్గం. ఈ సమయంలో అనవసర వివాదాలకు తావివ్వ రాద’న్నారు. ఆక్సిజన్ కొరతతో ఆస్పత్రుల్లో మరణాలపై విచారణకు ఆదేశించారు. దీనిపై విపక్ష కాంగ్రెస్ పార్టీ మండి పడింది. ‘దయలేని పాలకులే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారు. సంభవించిన ప్రతి మరణానికీ ప్రభుత్వ అసమర్ధతే కారణమ’ని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నేత రణ్దీప్ సింగ్ సూర్జేవాలా విమర్శించారు.