ఉత్తర దీనజ్‌పూర్: పశ్చిమ బెంగాల్లో మిగతా మూడు దశల పోలింగ్‌ను ఒకే రోజు నిర్వహించాలని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్య మంత్రి మమతా బెనర్జీ సోమ వారం మరో సారి విన్నవించారు. గతంలో వెలువరించినట్లే ఎన్నికలు నిర్వహించాలన్న నిర్ణయాన్ని పునః సమీ క్షించుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి విన్నవించారు. చివరి మూడు దశల ఎన్నికలను ఒకటి లేదా రెండు రోజులకు కుదించడం వల్ల కరోనా వైరస్ వ్యాప్తి మరింత వ్యాపించకుండా నిలువరించవచ్చని ఉత్తర దీనజ్‌పూర్‌లో సోమ వారం ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు. ‘చేతులు జోడించి వేడుకుంటున్నా.. మిగతా మూడు దశల ఎన్నికలను ఈసీ ఒకే దశలో నిర్వహించాలి. ఒకే రోజు కుదరక పోతే రెండు రోజుల్లో పోలింగ్ పూర్తి చేయండి. ఒక రోజైనా ఆదా చేయండి. బీజేపీ నేతలు చెప్పినట్టు మీరు నిర్ణయాలు తీసుకోకండి. పోలింగ్ షెడ్యూల్‌ని కనీసం ఒక్కరోజైనా కుదించడం వల్ల మీరు ప్రజల ఆరోగ్యాలను కాపాడిన వాళ్లవుతారు…’’ అని పేర్కొన్నారు. తాను గానీ, తమ పార్టీకి చెందిన ఇతర నేతలు గానీ తమ తమ ప్రాంతాల్లో ఎలాంటి ర్యాలీలు నిర్వహించబోమని కూడా స్పష్టం చేశారు. గడచిన ఆరు నెలల్లో మోదీ ప్రభుత్వం కరోనా వైరస్‌ను నిలువరించడంలో ‘‘దారుణంగా విఫలమైందని’ ఆరోపించారు.