మీ పోరాటం నా పోరాటం కూడా

న్యూ ఢిల్లీ: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కు మరిన్ని అధికారాలు కల్పించి, స్థానిక ప్రభుత్వాన్ని అలంకార ప్రాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ముసాయిదాపై పశ్చిమ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. సమాఖ్య వ్యవస్థపై ఇది మెరుపు దాడి గా అభివర్ణించారు. ఈ మేరకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు మమత లేఖ రాశారు. కేంద్రం తీసుకొచ్చిన ఈ బిల్లును వ్యతిరేకించాలని కోరుతూ బీజేపీయేతర ముఖ్యమంత్రులకు, రాజకీయ పార్టీలకు తాను లేఖలు రాస్తానని చెప్పారు. ఈ బిల్లును అందరం కలసికట్టుగా ఎదుర్కొందామని కోరతానని తెలిపారు. ఢిల్లీ ప్రభుత్వాన్ని పూర్తిగా బలహీనం చేసేందుకే ప్రజాస్వామ్య వ్యతిరేకంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా ఈ బిల్లును తీసుకొస్తున్నారని ఆమె పేర్కొన్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ కు ఎక్కువ అధికారాలను కల్పించి, ఢిల్లీ ముఖ్యమంత్రిని ఆయనకు విధేయుడుగా దిగజార్చేందుకు కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యాలపై బీజేపీ ప్రభుత్వం చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా సమైక్యంగా పోరాడేందుకు సమయం ఆసన్నమైందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలను బలహీనం చేస్తూ, వాటిని మున్సిపాలిటీల స్థాయికి దిగజార్చేందుకు కేంద్రం యత్నిస్తోందని మండిపడ్డారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే ఢిల్లీకి వచ్చి కేజ్రీవాల్ ని కలిసి మద్దతు ప్రకటిస్తానని మమత చెప్పారు. ‘మీ పోరాటం నా పోరాటం కూడా. మీరు చేస్తున్న పోరాటంలో విజయం సాధిస్తారని ఆకాంక్షిస్తున్నా’ అని కేజ్రీని ఉద్దేశించి అన్నారు.

.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos