దిల్లీ: అయోధ్యలో వివాదాస్పద రామ జన్మభూమి-మసీదు సమీపంలో వివాదంలో లేని 67 ఎకరాల ప్రాంతాన్ని అసలైన యజమానులకు అప్పగించేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్రం సుప్రీంకోర్టును కోరింది. రామ జన్మభూమికి సమీపంలో వివాదంలో లేని ప్రాంతాన్ని దాని యజమాని అయిన రామ జన్మభూమి నయాస్ లేదా రామాలయానికి సంబంధించిన ట్రస్టుకు అప్పగించేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్రం ఈరోజు కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రామ జన్మభూమి-మసీదు వివాదాస్పద ప్రాంతం 2.77ఎకరాలు కాగా 1991లో ప్రభుత్వం దాంతోపాటు వివాదాస్పద స్థలం చుట్టూ ఉన్న 67 ఎకరాలను కూడా స్వాధీనం చేసుకుంది వివాదంలో లేని మిగతా 67ఎకరాల భూమిని తమకు అప్పగించాలని రామ జన్మభూమి నయాస్ కోరుతోందని కేంద్రం ఈరోజు సుప్రీంకోర్టుకు దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొంది. అయితే గతంలో సుప్రీంకోర్టు ఈ 67 ఎకరాలను కూడా యథావిధిగా కేంద్రం ఆధీనంలోనే ఉంచాలని, వివాదం తేలే వరకూ ఎలాంటి మార్పులు చేయొద్దని ఆదేశించింది. వివాదాస్పద భూమిని మూడు పార్టీలు సున్ని వక్ఫ్ బోర్డు, నిర్మోహి అఖారా, రామ్ లల్లా సమానంగా పంచుకోవాలని 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పు చెప్పింది. అయితే ఆ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంలో 14 పిటిషన్లు దాఖలయ్యాయి. సుప్రీంలో కేసు విచారణ కొనసాగుతోంది. ఆదివారం కేసు విచారణ జరగాల్సి ఉండగా ధర్మాసనంలోని న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే అనారోగ్య కారణాలతో హాజరుకాకపోవడంతో విచారణ మంగళవారానికి వాయిదా వేశారు.