న్యూ ఢిల్లీ: పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఇంధన ధరలకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటామని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. ఈ విషయంపై చర్చించేందుకు పార్లమెంట్లో తమ డిమాండ్ను మళ్లీ లేవనెత్తుతామని తెలిపింది.‘ ఇంధన ధరల విషయంలో దేశ ప్రజల నుంచి ఆగ్రహజ్వాలలు వ్యక్తమవుతున్నాయి. వాటిని పార్లమెంట్లో లేవనెత్తాలనే మేము ప్రయత్నించామ’ని రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడుకు నోటీసు ఇచ్చిన అంశాన్ని గుర్తు చేశారు. ఇంధన ధరలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని, అందువల్లే ప్రభుత్వం దీనికి అనుమతించ లేదని అన్నారు. ఈ విషయంలో ఇతర పార్టీలు సైతం తమ వెంటే ఉన్నాయన్న ఖర్గే.. సాధారణ ప్రజల సమస్యలను ప్రస్తావించేందుకు తమకు సమయం ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఇంధన ధరలను పెంచి, గత ఆరేళ్లలో మోదీ సర్కార్ రూ. 21 లక్షల కోట్లను వసూలు చేసిందని దుయ్యబట్టారు. . ఆ డబ్బంతా ఎక్కడికి వెళ్లిందని ప్రశ్నించారు. పెద్ద కార్పొరేట్లకు పన్ను మినహాయింపులు ఇస్తూ.. మధ్య తరగతి ప్రజలపై భారం మోపుతున్నా రని ధ్వజ మెత్తారు.