న్యూ ఢిల్లీ : కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తోన్న ఆందోళన కొనసాగుతోంది. తమ డిమాండ్ను నెరవేర్చకపోతే మరోసారి లక్షలాది ట్రాక్టర్లతో నిరసన తెలుపుతామని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయిత్ హెచ్చరించారు. ట్రాక్టర్లతో పార్లమెంటును ముట్టడిస్తామని హెచ్చరించారు. మధ్య ప్రదేశ్లోని షియోపూర్లో నిర్వహించిన భారీ ర్యాలీలో మంగళవారం ఆయన మాట్లాడారు. తాము జనవరి 26న 3,500 ట్రాక్టర్లతో ఢిల్లీలోకి ప్రవేశించామని గుర్తు చేశారు. ఆ ట్రాక్టర్లన్నీ అద్దెకు తెచ్చిన ట్రాక్టర్లు కావని చెప్పారు.మధ్యప్రదేశ్ బీజేపీ నేత, కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కు ఎలాంటి అధికారాలు లేవని ఆయన పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఆయన సొంతంగా రైతులకు ఎప్పుడూ సమాధానం ఇవ్వలేరని చెప్పారు. చర్చలకు కూడా పలు పత్రాలు పట్టుకుని వస్తారని, వాటి ఆధారంగానే రైతులకు సమాధానాలు ఇస్తారని ఎద్దేవా చేశారు. ఈ నెల 14న రెవాలో, మార్చి 15న జబల్పూర్ ప్రాంతాల్లో రైతు ర్యాలీల్లో రాకేశ్ పాల్గొంటారు. అనంతరం తెలంగాణతో పాటు ఉత్తరాఖండ్, రాజస్థాన్, కర్ణాటకకు వెళ్లి రైతులతో చర్చలు జరుపుతారు.