దగ్గుబాటి కుటుంబం వద్దు..

దగ్గుబాటి కుటుంబం వద్దు..

యస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి, పర్చూరు నుంచి పోటీ చేయాలని భావిస్తున్న దగ్గుబాటి వెంకటేశ్వర రావు, పురంధేశ్వరిల తనయుడు దగ్గుబాటి హితేష్ చెంచురాంకు షాక్ మీద షాక్ తగులుతోంది. ఇప్పటికే ఆయనకు అమెరికా పౌరసత్వం ఉన్న నేపథ్యంలో దానిని రద్దు చేయించుకున్న తర్వాతే పోటీ చేయాల్సిన పరిస్థితి ఉంది.
పర్చూరు వైసీపీ కేడర్ తీవ్ర అసంతృప్తి..
ఇప్పుడు మరో షాక్ తగులుతోంది. దగ్గుబాటి వెంకటేశ్వర రావు, తనయుడు హితేష్‌లు హైదరాబాదులో తమ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలవడంపై పర్చూరు నియోజకవర్గ వైసీపీ కేడర్ తీవ్ర అసంతృప్తికి గురైనట్లుగా తెలుస్తోంది. జగన్ వారికి కలిసేందుకు కూడా అవకాశం ఇవ్వడాన్ని వైసీపీ కేడర్ జీర్ణించుకోలేకపోతోంది.
దగ్గుబాటి వెంకటేశ్వర రావు, హితేష్ చెంచురాంల రాకను నిరసిస్తూ పర్చూరు రోటరీ భవన్‌లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు సమావేశమయ్యారు. అధికారం ఎక్కడ ఉంటే దగ్గుబాటి అక్కడ ఉంటారని, పార్టీలో పని చేస్తోన్న వారికి అన్యాయం చేయవద్దని వారు అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. దగ్గుబాటి కుటుంబానికి టిక్కెట్ ఇచ్చే సంప్రదాయం మంచిది కాదన్నారు.
పర్చూరు నియోజకవర్గం నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున రావి రామనాథం బాబు టిక్కెట్ ఆశిస్తున్నారు. ఈ టిక్కెట్ రామనాథంకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతేకాదు, పార్టీలోకి దగ్గుబాటి రాకను తాము వ్యతిరేకిస్తున్నట్లు పర్చూరు వైసీపీ కేడర్ తెలిపింది. ఓ వైపు దగ్గుబాటి కుటుంబాన్నిజగన్ స్వాగతిస్తంటే, పర్చూరు నియోజకవర్గంలోని కీలక కేడర్ వ్యతిరేకిస్తుండటం వైసీపీకి షాక్ అని చెప్పవచ్చు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos