పాట్నా : ఓ ప్రభుత్వ కార్యక్రమానికి మంత్రికి బదులు ఆయన సోదరుడు హాజరవటం ప్రస్తుతం బిహార్ రాజకీయాల్లో హాట్ టాపిక్. దీనిపై సాక్షాత్తూ ముఖ్యమంత్రి నితీశ్ వివరణ ఇచ్చారు. హాజీపూర్లో ఒక ప్రభుత్వ కార్యక్రమానికి మంత్రి ముఖేశ్ సహాని హాజరు కావాల్సి ఉంది. ఆయనకు బదులు ఆయన సోదరుడు సంతోష్ కుమార్ సహానీ హాజరయ్యారు. ‘‘మంత్రి బాగా బీజీగా ఉన్నారు. ఆయన ప్రతినిధిగా నేను హాజరయ్యాను’’ అని పేర్కొన్నారు. దీనిపై ప్రతి పక్షాలు తీవ్రంగా విరుచుకుపడ్డాయి. మంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. ‘ఈ విషయం నాకు తెలియదు. అదే గనక నిజమైతే షాక్కు గురి చేసే అంశం. అలాంటి ఘటనలు జరగడం సరికాదు. ఈ విషయాన్ని పరిశీలిస్తా’మని నితీశ్ తెలిపారు. ‘అసెంబ్లీ సమావేశాలు ఉన్న కారణంగా కార్యక్రమానికి హాజరుకాలేక పోయా. అంతే తప్ప ఆయన్ను పంపించడంలో వేరే దురుద్దేశం ఏమీ లేదు. ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చూసుకుంటాన’ని మంత్రి ముఖేశ్ వివరించారు.