అమరాతి: తెలుగువాళ్ల పోరాట ఫలితమే విశాఖ ఉక్కు అని ఏపీ రవాణా శాఖ మంత్రి పేర్నినాని అన్నారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రజల ఆస్తిగానే ఉంచాలన్నారు. ప్రైవేటీకరణ కాకుండా కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాలని సూచించారు. దీనిలో భాగంగా రేపటి (శుక్రవారం) ఏపీ బంద్‌కు ప్రభుత్వం సంఘీభావం తెలుపుతోందని వెల్లడించారు. ఈ క్రమంలోనే రేపు మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఆర్టీసీ బస్సులు నిలిపివేస్తామని పేర్కొన్నారు. ఒంటిగంట తర్వాత కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులు నిర్వహిస్తారని మంత్రి పేర్ని నాని తెలిపారు.
శుక్రవారం చేపట్టబోయే రాష్ట్ర బంద్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలిపిందని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను గురువారం తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అఖిల పక్షాలు, కార్మిక సంఘాలు చేపడుతున్న రాష్ట్ర బంద్‌కు ఉద్యోగులు, వర్తక వ్యాపార వాణిజ్య సంస్థలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు మద్దతు ప్రకటించాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయనున్నట్లు ప్రకటించారని ఆయన గుర్తు చేశారు.
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ఆపాలంటూ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే ఆందోళనలు జరిగిన సంగతి తెలిసిందే. అదే సమయంలో ఏపీ ప్రభుత్వం కూడా విశాఖ స్టీల్ ఫ్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకించింది. దానిలో భాగంగా గత నెలలో విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీ ప్రతినిధులతో సీఎం జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. కేంద్రం నిర్ణయంలో ఎలాంటి మార్పు లేకపోతే విశాఖ స్టీల్ ప్లాంట్‌పై అనుకూలంగా బడ్జెట్ సమావేశాల్లో తీర్మానం చేస్తామని వారికి హామీ ఇచ్చారు. ఇప్పటికే ప్లాంట్ ప్రైవేటీకరణపై ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాసినట్లు గుర్తుచేశారు.