న్యూఢిల్లీ : రైతు వ్యతిరేక చట్టాలపై పోరాడుతున్న మేధావులు, సినీ ప్రముఖులపై కేంద్ర దర్యాప్తు సంస్థల చేత దాడులు జరిపించడంపై సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కెఎం) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మొక్కవోని దీక్షతో ఆందోళన కొనసాగిస్తున్న అన్నదాతల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించకపోగా, తమ పోరాటానికి మద్దతుగా నిలుస్తున్నవారిని వివిధ రూపాల్లో వేధిస్తోందని విమర్శించింది. ఈ బెదిరింపులు, దాడులకు లెక్కచేయకుండా ఉద్యమానికి మద్దతుగా వివిధ రంగాలకు చెందిన ప్రము ఖులు ముందుకు వస్తుండడం పట్ల సమన్వయకర్త దర్శన్ పాల్ హర్షం వ్యక్తం చేశారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక మంది మేధావులు, ప్రముఖులు రైతుల ఉద్యమానికి మద్దతు ఇస్తున్నారని, అలాంటి వారిలో ప్రఖ్యాత సినీ దర్శక, నిర్మాత అనురాగ్ కశ్యప్, సినీ నటి తాప్సీ కూడా ఉన్నారని తెలిపారు. మరో వైపు ఢిల్లీ సరి హద్దులో కొనసాగుతున్న అన్నదాతల ఉద్యమం గురువారం నాటికి 99వ రోజుకు చేరింది. జాతీయ దర్యాప్తు సంస్థలను సాధనాలుగా చేసుకుని అసమ్మతిని అణచివేసే కుతంత్రాలను ప్రభుత్వం విరమించుకోవాలని హితవు పలికారు. రైతు ఉద్యమాన్ని ఎంతగా అణిచివేయాలని చూస్తే అంతకు రెట్టించిన వేగంతో అది విస్తరిస్తుందని హెచ్చ రించారు. అన్నదాతల ఉద్యమంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మోడీ సర్కార్పై ఒత్తిడి పెంచేందుకు వివిధ రాష్ట్రాల్లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపిని ఓడిం చేందుకు సంయుక్త కిసాన్ మోర్చా కృషి చేస్తుందన్నారు. ఆయా రాష్ట్రాల్లో బిజెపిని ఓడించాలని పిలుపునిస్తూ ప్రచారం నిర్వహించాలని సంయుక్త కిసాన్ మోర్చా నిర్ణయిం చిం దన్నారు. త్వరలోనే కేరళ, అస్సాం, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్, తమిళనాడులో ఎస్కెఎం నాయకుల బఅందం పర్యటిస్తుందని తెలిపారు. వ్యవసాయ వ్యతిరేక చట్టాలను తక్షణమే రద్దు చేసి, ఉద్యమిస్తున్న రైతు సంఘాలతో మోడీ సర్కారు చర్చలు జరపాలని కోరారు. అన్నదాతలు ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ సి2 ప్లస్ 50 శాతం) కల్పించాలని డిమాండ్ చేశారు. నల్ల చట్టాలను వెనక్కి తీసుకునేదాకా కిసాన్ మహా పంచాయతీలు కొనసాగుతాయని చెప్పారు.
.