ఓడితే …ఆశలు గల్లంతే…

  • In Sports
  • February 12, 2021
  • 164 Views
ఓడితే …ఆశలు గల్లంతే…

చెన్నై: నాలుగు మ్యాచుల టెస్టు సిరీస్‌లో భాగంగా శనివారం భారత్-ఇంగ్లండ్ మధ్య చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో రెండో టెస్టు ప్రారంభం కానుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్లో చోటు కోసం ఇరు జట్లకు ఈ మ్యాచ్ ఎంతో కీలకం. దీంతో ఈ టెస్టు హోరాహోరీగా సాగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆస్ట్రేలియా గడ్డపై సిరీస్ కైవసం చేసుకుని స్వదేశానికి సగర్వంగా వచ్చిన టీమిండియా.. తొలి టెస్టులో ఇంగ్లండ్‌ చేతిలో దారుణ పరాభవాన్ని ఎదుర్కొంది. దీంతో రెండో టెస్టులో అంతకు అంత తీర్చుకోవాలని కోహ్లీ సేన పట్టుదలగా ఉండగా, ఈ మ్యాచులో గెలిచి సిరీస్‌పై పట్టు సాధించాలని ఇంగ్లండ్ భావిస్తోంది.
మరోవైపు, భారత జట్టు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు చేరుకోవాలంటే ఇంగ్లండ్‌తో జరిగే తదుపరి మ్యాచుల్లో కనీసం రెండింటిలో గెలవాల్సి ఉంటుంది. అలాగే, ఒక్కదాంట్లోనూ ఓటమి పాలవకూడదు. ఇంగ్లండ్ జట్టులోకి కొత్త వికెట్ కీపర్ బెన్ ఫోక్స్ రానుండగా, జేమ్స్ అండర్సన్‌పై ఒత్తిడి తగ్గించేందుకు అతడికి విశ్రాంతి కల్పించి స్టువార్ట్ బ్రాడ్‌కు అవకాశం కల్పించింది. తొలి టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో అత్యధిక వికెట్లు తీసిన డెమ్ బెస్ స్థానంలో మొయీన్ అలీ జట్టులోకి వచ్చాడు. ఇక, మోచేయి గాయంతో బాధపడుతున్న జోఫ్రా ఆర్చర్ స్థానంలో ఆల్‌రౌండర్‌ క్రిస్‌వోక్స్‌‌  జట్టులోకి వచ్చాడు.

భారత జట్టు విషయానికి వస్తే టీమిండియా టాప్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు ఇతర బౌలర్ల నుంచి సరైన సహకారం లభించడం లేదు. గాయపడిన రవీంద్ర జడేజా స్థానంలో అక్సర్ పటేల్ జట్టులోకి వచ్చే అవకాశం ఉండడం కొంత ఊరటనిచ్చే అంశం.

టెస్టుల్లో అరంగేట్రం చేయబోతున్న పటేల్ నుంచి అశ్విన్‌కు మద్దతు లభిస్తుందని భావిస్తున్నారు. కుల్దీప్ యాదవ్ విషయంలో మాత్రం ఇంకా స్పష్టత లేదు. బ్యాటింగ్ విభాగాన్ని పటిష్టం చేయాలనుకుంటే కనుక హార్దిక్ పాండ్యాకు తుది జట్టులో చోటు లభించొచ్చు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos