న్యూఢిల్లీ : వేసవిలోనూ ఉద్యమాన్ని కొనసాగించేందుకు అన్నదాతలు సిద్ధమౌతున్నారు. ఇప్పటి వరకు టార్పాలిన్ టెంట్లు చలిని తట్టుకు నేందుకు సాయపడ్డాయి. వేసవి కోసం షెడ్లు, దోమ తెరలు, ఫ్యాన్లు, కూలర్లు , ప్లాస్టిక్ షీట్లు, మొదలైనవి ఆర్డర్ చేసినట్లు తెలుస్తోంది. వేసవి ని తట్టుకునేందుకు టెంట్ల టార్పాలిన్ తొలగించి…దోమ తెరల ఏర్పాట్లు చేయనున్నారు. అవసరమైన దుస్తులు, ఫ్యాన్లను, కూలర్లను ఇంటి నుండి తెచ్చుకోవాలన్న యోచనలో చాలా మంది రైతులు ఉన్నారు. రైతులు డీహైడ్రెషన్కు గురికాకుండా ఉండేందుకు చల్లని నీరు, మజ్జిగ వంటి పానీయాల్ని ఏర్పాట్లు చేస్తామని భాగ్పట్కు చెందిన రైతు రాజ్బీర్ సింగ్ పేర్కొన్నారు. అవసరమైన సదుపాయాల కోసం గురుద్వారా సమితులతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. విద్యుత్ సరఫరాను కేంద్రం నిలిపేస్తే ఫ్యాన్లు, కూలర్ల తిరిగేందుకు జనరేటర్లు ఏర్పాటు చేసుకుంటా మన్నారు. ఖర్చును తగ్గించుకునేందుకు సోలార్ ప్యానల్స్ వంటి సౌకర్యాలను ఏర్పరుచుకోదలచారు.