తిరుపతి: తనపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ విధించిన ఆంక్షలపై పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఆదేశాల మేరకే నిమ్మగడ్డ రమేష్ కు మార్ పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వంలో మంత్రిపై ఎలా చర్యలు తీసుకుంటారని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల అధికారిగా ఉన్న వ్యక్తికి నియంత్రణ ఉండాలని హితవు పలికారు. ఎస్ఈసీ హోదాలో ప్రభుత్వంతో ఎప్పుడూ చర్చించలేదని, చంద్రబాబు ఆలోచనలతోనే నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారని పెద్దిరెడ్డి నిప్పులు చెరిగారు. ‘‘చంద్రబాబును సీఎం కుర్చిలో కూర్చోబెట్టాలన్నదే నిమ్మగడ్డ తాపత్రయం. నిమ్మగడ్డ ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరుకావాల్సిందే. ఆయనకు మూడేళ్ల జైలు శిక్ష తప్పదు. నిమ్మగడ్డ తనను తాను రాష్ట్రపతి అనుకుంటున్నారు. చంద్రబాబుకు తెలియకుండా యాప్ తయారైందా? చంద్రబాబు తయారు చేసిన యాప్ను నిమ్మగడ్డ అమలు చేశారంటూ’’ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. కాగా మంత్రి పెద్దిరెడ్డిపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆంక్షలు విధిస్తూ ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే.