విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మరో వివాదాస్పద ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తన నివాసం నుంచి బయటకు రాకుండా కట్టడి చేయాలని సూచిస్తూ డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు శనివారం లేఖ రాశారు. పంచాయతీ ఎన్నికలు ముగిసే తేదీ 21 ఫిబ్రవరి వరకు ఆయన తన నివాసంలోనే పరిమితం అయ్యేలాగా చూడాల్సిందిగా డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. మంత్రి పెద్దిరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు రాష్ట్రంతోపాటు చిత్తూరు జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని ఎస్ఈసీ లేఖలో పేర్కొన్నారు. ఫిబ్రవరి 21 తేదీ వరకు పెద్దిరెడ్డి తన ఇంటి నుంచి బయటకు రాకుండా నిలువరించాలని డీజీపీకి సూచించారు. ఎన్నికలు ముగిసేంతవరకు మంత్రి మీడియాతోనూ మాట్లాడకుండా చూడాలని స్పష్టం చేశారు. తన ఫిర్యాదుకు మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడిన పత్రిక క్లిప్పింగులను నిమ్మగడ్డ రమేష్ కుమార్ జత చేశారు.