ఘజియాబాద్: ఘాజీపూర్ సరిహద్దుకు రైతులు భారీగా చేరుకుంటున్నారు. దీంతో ఈ ఉద్యమం మళ్లీ తీవ్రంగా పుంజుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఢిల్లీ శివారులోని ఉత్తర్ప్రదేశ్ సరిహద్దు ప్రాంతమైన ఘాజీపూర్ మరోసారి రైతన్నలకు నిరసన కేంద్రంగా మారిపోయింది. ఇప్పటికే ఢిల్లీ- మీరట్ జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున రైతులు చేరుకున్నారు. హర్యానా, రాజస్థాన్లోని పలు జిల్లాలకు చెందిన నేతలు కూడా చేరుకుంటున్నారు. రైతులు భారీగా తరలిరావడం పట్ల ఆ సంఘం మీరట్ జోన్ అధ్యక్షుడు పవన్ కతానా సంతోషం వ్యక్తంచేశారు. ఉద్యమం మరింత బలపడిందన్నారు. మూడు వ్యవసాయ చట్టాలు రద్దయ్యే వరకు శాంతియుతంగా ఈ ఉద్యమం కొనసాగుతుందని స్పష్టంచేశారు. ఇది రాజకీయ ఉద్యమం కాదని, ఉద్యమానికి సంఘీభావం తెలిపే ఎవరికైనా బీకేయూ స్వాగతం పలుకుతుందని పవన్ కతానా పిలుపునిచ్చారు. శనివారం రాత్రి నాటికి సుమారు 10వేల మంది తరలివస్తారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. రైతుల నిరసన నేపథ్యంలో భారీగా భద్రతా బలగాలు మోహరించాయి. అలాగే ఢిల్లీ- మేరట్ ఎక్స్ప్రెస్ వేపై రాకపోకలు నిలిపివేసినట్లు ఢిల్లీ ట్రాఫిక్ పోలీసు విభాగం తెలిపింది.