ఛండీగఢ్: పంజాబ్, హర్యానాకు చెందిన రైతులు ప్రధానంగా పాల్గొంటున్న ఆందోళనలు ఓవైపు కొనసాగుతుండగా, మరోవైపు ఈ రెండు రాష్ట్రాల్లోని సుమారు 45 గోదాములపై సీబీఐ దాడులు జరిపింది. బియ్యం, గోధుమ నిల్వల శాంపిల్స్‌ను సీజ్ చేసింది. పారామిలటరీ బలగాల సహాయంతో గురువారం రాత్రి నుంచి సీబీఐ సోదాలు జరుపుతోంది. పంజాబ్ ధాన్యాల సేకరణ సంస్థ, పంజాబ్ వేర్ హౌసింగ్, కొన్ని ఎఫ్ఐసీఐకి చెందిన గోదాములపై ఈ దాడులు జరిగాయి. ఈ గోదాములలోని సెంట్రల్ పూల్ ఆహార ధాన్యాల నిల్వల నాణ్యత, పరిమాణాన్ని సీబీఐ తనిఖీలు చేస్తోందని సీబీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు. 2019-20, 2020-21 సంవత్సరాలకు సంబంధించి సెంట్రల్ పూల్ నిల్వలను ఈ గోదాములలో నిల్వ చేసినట్టు చెప్పారు. పంజాబ్లోని లూథియానాలో తొమ్మిది గోదాములు, మన్సా, కపుర్తలాలోని ఒక్కో గోదాముల్లో తనిఖీలు జరిగాయి. హర్యానాలోని సాహ్బాద్, సిర్సాలోనూ సీబీఐ దాడులు జరిపింది.
కేంద్రానికి పంపేందుకు స్టాకిస్టులు యూపీ, బీహార్ నుంచి ధాన్యం సేకరిస్తుంటారని, ఇదే సమయంలో నాణ్యత కలిగిన ఆహారధాన్యాలను ఓపెన్ మార్కెట్లో అమ్ముతుంటారని మాన్సా ఎఫ్సీఐ గోదాము వర్గాలు తెలిపాయి. పెద్ద ఎత్తున నాణ్యతా ప్రమాణాలు తక్కువున్న బియ్యం సరఫరా అవుతుందన్న సమాచారంతో ఇందులో ఎఫ్సీఐ అధికారుల ప్రమేయం ఏమేరకు ఉందనే విషయంపై సీబీఐ దర్యాప్తు జరుపుతోంది.
సేరరించిన ఆహారధాన్యాల విషయంలో నాణ్యత తనిఖీలను త్వరలోనే ప్రభుత్వం చేపట్టనున్నట్టు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయెల్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. కొద్ది సంవత్సరాల క్రితం కూడా సీబీఐ ఇలాంటి దాడులు జరిపింది. రిపబ్లిక్ డే ఘటన అనంతరం రైతులు, ముఖ్యంగా పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రైతులు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య సంబంధాలు క్షీణించిన సమయంలో సీబీఐ దాడులు చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.