న్యూ ఢిల్లీ: రష్యా నుంచి మారణాయుధాల్ని కొంటే ఆంక్షల్ని విధిస్తామని అమెరికా మన దేశాన్ని హెచ్చరించింది. యూఎస్ కాంగ్రెస్ ఆధ్వర్యంలోని సీఆర్ఎస్ (కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్) తాజా నివేదిక భారత్ తన రక్షణ విధానాన్ని మార్చుకోవాలని, సంస్కరణలు తీసుకు రావాలని సూచించింది. ‘రష్యా తయారు చేసిన ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కు మేము వ్యతిరేకం. వీటిని ఇండియా కొనుగోలు చేస్తే, ఆంక్షలు విధించే అవకాశం ఉంది. అమెరికా ఆంక్షల చట్టానికి ఇండియా – రష్యా లావాదేవీ వ్యతిరేకంగా ఉండటమే ఇందుకు కారణమ’ని పేర్కొంది. ఇది అధికారిక నివేదిక కాదు. రెండు పార్టీలకు చెందిన స్వతంత్ర సభ్యులు దీన్ని తయారు చేసారు. ఆంక్షలు విధించే దేశంతో ఉన్న ద్వైపాక్షిక బంధం ఆధారంగానే తుది నిర్ణయాలు ఉంటాయి.ఈ క్షిపణుల కోసం భారత్ 2018లో ఐదు బిలియన్ డాలర్ల విలువైన వ్యాపార ఒప్పం దాన్ని కుదుర్చుకుంది. 2019లో 800 మిలియన్ డాలర్ల అడ్వాన్స్ కూడా ఇచ్చింది. ట్రంప్ ప్రభుత్వం ఎన్ని హెచ్చరికలు చేసినా, మోదీ సర్కారు వెనుకంజ వేయలేదు. ఇండియాకు ఇరుగు, పొరుగున ఉన్న దేశాల నుంచి ఉన్న ముప్పు నేపథ్యంలో వీటి కొనుగోలు తప్పనిసరని ఇండియా అంటోంది. ఇదే సమయంలో రష్యా సైతం భారత్ కు అనుకూలంగానే మాట్లాడుతోంది. ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ప్రపంచంలోనే ఎదురులేనిది. యూఎస్ తయారు చేసిన ఇదే తరహా మిసైల్స్ థాడ్, పేట్రియాట్ లతో పోలిస్తే ఇవి బాగా పనిచేస్తాయి. అమెరికా ఈ రెండు రకాల వ్యవస్థలకు ఇండియాకు విక్రయించాలని అమెరికా గతంలో ప్రయత్నించగా, మోదీ ప్రభుత్వం మాత్రం రష్యా వైపు మొగ్గు చూపింది.ఇవి౪ విమానాలతో పాటు డ్రోన్లు, క్షిపణులను కూల్చి వేస్తాయి. విమానాలు 30 కి.మీ ఎత్తులో ఉన్నా, 400 కి.మీ దూరంలోనే గుర్తించి, ఎదురుదాడికి దిగుతుంది. ఒకే సమయంలో 30 వరకూ విమానాలు, యూఏవీలు, క్షిపణులను ఎదుర్కొనే సత్తా దీని సొంతం. ఎక్కడికైనా సులువుగా తీసుకుని వెళ్లి, 5 నిమిషాల్లోనే ఎదురుదాడికి సిద్ధం చేసే వీలుంది. విమానాలు, నౌకలు, భూమిపై నుంచి కూడా వినియోగించవచ్చు.