న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధ్యక్షుడు అమిత్ షా కాంగ్రెస్ అగ్ర నేతలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. హిమాచల్ ప్రదేశ్‌లోని ఉణలో సోమవారం జరిగిన ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ ‘వన్ ర్యాంక్, వన్ పెన్షన్’ కు సంక్షిప్త రూపం ఓఆర్ఓపీకి కొత్త వివరణ ఇచ్చారు. ఓఆర్ఓపీ అంటే ఓన్లీ రాహుల్, ఓన్లీ ప్రియాంక అని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైనికులకు వన్ ర్యాంక్, వన్ పెన్షన్‌ను అమలు చేశారని అమిత్ షా చెప్పారు. మోదీ మన జవాన్లకు వన్ ర్యాంక్ వన్ పెన్షన్ ఇస్తే, కాంగ్రెస్ మాత్రం ఓన్లీ రాహుల్, ఓన్లీ ప్రియాంకను ఇచ్చిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇటీవలే ఆయన సోదరి ప్రియాంక గాంధీ వాద్రాను తూర్పు ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమించిన సంగతి తెలిసిందే. రాహుల్, ప్రియాంక వచ్చే నెల 4న కుంభ మేళాలో పాల్గొంటారని, అనంతరం సంయుక్తంగా మీడియాతో మాట్లాడతారని సమాచారం.