న్యూఢిల్లీ, జనవరి 27: ఈవారంలో స్టాక్ మార్కెట్లు తీవ్ర ఆటుపోటులకు గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరానికిగాను నరేంద్ర మోదీ సర్కార్ ప్రవేశపెట్టనున్న మధ్యంతర బడ్జెట్‌తోపాటు పలు కార్పొరేట్ల ఆర్థిక ఫలితాలు విడుదల చేయనుండటం, అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను మరోదఫా పెంపు వంటి నిర్ణయాలు స్టాక్ మార్కెట్లకు దిశానిర్దేశం చేయనున్నాయని మార్కెట్ విశ్లేషకులు అంచనావేస్తున్నాయి. అమెరికా-చైనా దేశాల మధ్య వాణిజ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటుండటం, దేశ వృద్ధిపై పెట్టుబడిదారుల్లో నెలకొన్న ఆందోళనల నేపథ్యంలో సూచీలు తిరోగమనబాట పట్టే అవకాశం ఉన్నదని జియోజిట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. బడ్జెట్‌తోపాటు ఫెడరల్ ఒపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్‌వోఎంసీ) కమిటీ సమావేశం, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఐవోసీ, హెచ్‌సీఎల్‌ల మూడో త్రైమాసికానికి ప్రకటించనున్న ఆర్థిక ఫలితాలు కూడా కీలకం కానున్నాయి. ఇప్పటి వరకు ప్రకటించిన ఏ సంస్థ కూడా ఆశాజనక ఆర్థిక ఫలితాలను ప్రకటించలేకపోవడంతో స్టాక్ మార్కెట్లలో అనిశ్చిత పరిస్థితి నెలకొంది. వీటికితోడు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు పెరుగుతుండటం కూడా పెట్టుబడిదారుల్లో ఆందోళనను మరింత తీవ్రతరం చేసింది.
దీంతో గడిచిన రెండు వారాల్లో సూచీలు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. ఈవారంలో బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, యాక్సిస్, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్‌సీఎల్ టెక్నాలజీ, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్ ఆటో, ఐసీఐసీఐ బ్యాంక్, హీరో మోటోకార్ప్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, ఎస్‌బీఐ వంటి బ్లూచిప్ కంపెనీలు తమ మూడో త్రైమాసికపు ఫలితాలను విడుదల చేయబోతున్నాయి. 2019-20 ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్ర సర్కార్ ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉన్నది. విదేశీ నిధుల ప్రవాహాంపై పెట్టుబడిదారులు దృష్టి సారించనున్నారు. ప్రస్తుత నెలకుగాను డెరివేటివ్ కాంట్రాక్టు గడువు గురువారంతో ముగియనుండటం, తయారీ రంగానికి సంబంధించి పీఎంఐ డాటా శుక్రవారం విడుదల కానుండటం సూచీలపై ప్రభావం చూపనున్నాయి. గడిచిన వారంలో సెన్సెక్స్ 361 పాయింట్లు, నిఫ్టీ 126 పాయింట్లు నష్టపోయాయి.
పదింటిలో నాలుగు…
గడిచిన వారంలో స్టాక్ మార్కెట్లో లిైస్టెన టాప్-10 కంపెనీల్లో నాలుగింటి మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రూ.54,456.69 కోట్ల మేర పెరిగింది. వీటిలో ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అత్యధికంగా లాభపడింది. ఆర్‌ఐఎల్‌తోపాటు టీసీఎస్, హెచ్‌యూఎల్, కొటక్ మహీంద్రా బ్యాంక్ లాభపడగా..హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్ఫోసిస్, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంకులు భారీగా నష్టపోయాయి. ఆర్‌ఐఎల్ నికర విలువ రూ.40,123 కోట్లు పెరుగగా, టీసీఎస్ రూ.6,998 కోట్లు, కొటక్ మహీంద్రా రూ.5,321.77 కోట్లు, హెచ్‌యూఎల్ రూ.2,013 కోట్లు మేర పెరిగాయి.
ఆకట్టుకోని గోల్డ్ ఈటీఎఫ్‌లు
గతేడాది గోల్డ్ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) నుంచి మదుపరులు రూ.570 కోట్లకుపైగా పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. ఇలా పెట్టుబడులను వెనుకకు తీసుకోవడం వరుసగా ఇది ఆరో ఏడాది కావడం గమనార్హం. కాగా, 2017తో పోల్చితే గోల్డ్ ఫండ్స్ ఆధ్వర్యంలోని ఆస్తుల విలువ 2018లో 6 శాతం పడిపోయి రూ.4,571 కోట్లకు చేరిందని ఆంఫీ లెక్కలు చెబుతున్నాయి.
కొనసాగుతున్న ఎఫ్‌పీఐల ఉపసంహరణ
విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల(ఎఫ్‌పీఐ) నిధుల ఉపసంహరణ కొనసాగుతున్నది. ప్రస్తుత నెలలో ఇప్పటివరకు దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి ఎఫ్‌పీఐలు రూ.6 వేల కోట్లను తరలించుకుపోయారు. భవిష్యత్తులో మరిన్ని నిధులు తరలించుకుపోయే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. గతేడాది అక్టోబర్‌లో రూ.28,900 కోట్లను ఉపసంహరించుకున్న ఎఫ్‌పీఐలు..ఆ మరుసటి రెండు నెలల్లో రూ.8,584 కోట్ల మేర నిధులను దేశీయ డెబిట్, ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టారు. జనవరి 1-25 మధ్యకాలంలో ఎఫ్‌పీఐలు రూ.5,880 కోట్ల నిధులను ఉపసంహరించుకున్నట్లు స్కాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ వద్ద ఉన్న సమాచారం మేరకు తెలిసింది. అంతర్జాతీయ దేశాల్లో జరుగుతున్న పరిణామాలకు తోడు దేశీయ సార్వత్రిక ఎన్నిలకు దగ్గర పడుతుండటంతో ఇన్వెస్టర్లలో ఆందోళను మరింత తీవ్రతరం చేసిందని వినోద్ నాయర్ అభిప్రాయపడ్డారు. నూతన సంవత్సరం తొలి నెలలోనే ఎఫ్‌పీఐలు నిధులను తరలించుకోవడం దేశ ఆర్థిక వ్యవస్థకు మంచిదికాదని, భవిష్యత్తులో వేచి చూసి దోరణిలో వారు ఉండే అవకాశం ఉందన్నారు. క్రూడాయిల్ ధరలు, రూపాయి గమనం, దేశీయ ఆర్థిక స్థితిగతులు, గ్లోబల్ ట్రేడ్‌వార్‌తో ఎఫ్‌పీఐల్లో ఆందోళన నలెకొన్నదని ఆయన పేర్కొన్నారు.