ముంబై :‘వాళ్లు (బీజేపీ) పిల్లల్ని, మహిళల్ని, కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని దిగజారి ప్రవర్తిస్తే మేమూ అదే తరహాలో సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది’ శివసేన నేత సంజయ్ రౌత్ ఘాటుగా స్పందించారు.సోమవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘వాస్తవానికి ఎలాంటి పొరపాటూ జరగ లేదు. హెచ్డీఐఎల్, పీఎంసీ గురించి బీజేపీ నేతలు ఏవేవో లెక్కలు చెబుతున్నారు. వాళ్లకి ఈ సమాచారం ఎక్కడిది? మూడు నెలలుగా భాజపా నేతలు ఈడీ కార్యాలయానికి తిరగడం మేము గమనిస్తూనే ఉన్నాం. మా ప్రభుత్వాన్ని ఎవరూ కదల్చలేరు. ఈడీకి తొందరలోనే సమాధానం చెప్తాం’’ అని వివరించారు. సంజయ్ రౌత్ భార్య వర్ష రౌత్కు –ఈడీ తాఖీదుల్ని జారీ చేసినందుకు శివసేన పై బీజేపీ దాడికి దిగింది. పీఎంసీ బ్యాంక్ కుంభకోణానికి సంబంధించి వర్ష రౌత్కు ఈడీ మూడుసార్లు నోటీసులు పంపింది. అయితే వాటికి ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారని బీజేపీ సీనియర్ నేత కిరిట్ సోమయ్య ప్రశ్నించారు. వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డారు. రౌత్ ఎందుకంత ఆగ్రహం చెందుతున్నారని ఎద్దేవా చేశారు.