కోల్కతా: ఇటీవలే తృణమూల్ కాంగ్రెస్లో చేరిన భాజపా లోక్సభ సభ్యుడు సౌమిత్ర ఖన్న భార్య సుజాతా మండల్ కాషాయ దళంపై తీవ్ర విమర్శలు చేశారు. ముమ్మారు తలాక్ రద్దు చేసిన పార్టీనే విడాకులు ఇవ్వాలని తన భర్తను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. పార్టీ మారినందుకే విడాకులు ఇస్తానని అంటున్నారని ఆవేదన చెందారు. బుధవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘వ్యక్తిగత జీవితంలో రాజకీయాలు ప్రవేశించడం ఆ బంధానికి మంచిది కాదు. భాజపాలోని చెడు వ్యక్తులతో సౌమిత్ర సహవాసం చేస్తున్నారు. ఆయన్ను నాకు వ్యతిరేకంగా ఉసిగొల్పుతున్నారు. ముమ్మారు తలాక్ను నిషేధించిన పార్టీయే ఇప్పుడు నాకు విడాకులు ఇవ్వాలని సౌమిత్రను అడుగుతోంది.నేను ఇప్పటికీ సౌమిత్రను ప్రేమిస్తున్నా. ఆయనే నా భర్త అని సింధూరం ధరిస్తున్నా. ఒత్తిడి వల్ల, పార్టీపై ఉన్న నమ్మకాన్ని నిరూపించేందుకే పదేళ్ల బంధాన్ని ఆయన ముగిస్తున్నారు. మాది ప్రేమ వివాహం. ఒక్కరోజులో అది ఎలా ముగిసిపోతుంది? గౌరవం, భద్రతను దృష్టిలో ఉంచుకొనే టీఎంసీలో చేరాను. భాజపాలో ఎలాంటి డిమాండ్లు చేయలేదు. ఆ పార్టీలో నాకు సరైన మర్యాద లభించలేదని వెల్లడించారు. భార్యకు ఎందుకు విడాకులు ఇస్తున్నారని ఏ భాజపా నేత సౌమిత్రను అడగడం లేద’ని ఆక్షేపించారు.