న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి దెబ్బ వ్యాపారులపై గట్టిగా పడింది. లాక్‌డౌన్ కారణంగా వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. చాలా మంది అప్పులు తీర్చేందుకు ఉన్న ఆస్తులను కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆస్తులు లేని వారు అప్పులు తీర్చేందుకు వివిధ మార్గాలను అనుసరిస్తున్నారు. కశ్మీర్‌లో ఓ వ్యాపారి అప్పులు తీర్చేందుకు ఏకంగా తన కిడ్నీని అమ్మకానికి పెట్టాడు. వివరాల్లోకి వెళ్తే.. కశ్మీర్‌లోని కుల్గమ్ జిల్లాకు చెందిన సబ్జర్ అహ్మద్ ఖాన్(28) అనే వ్యక్తి కార్ల డీలరుగా పనిచేసేవాడు.
కరోనా కారణంగా తాను తీసుకున్న రూ. 91 లక్షల రుణాన్ని చెల్లించలేక అవస్థలు పడుతూ వచ్చాడు. రుణాన్ని ఏ విధంగా తీర్చాలో తెలియక ‘నా కిడ్నీని అమ్మాలనుకుంటున్నా’ అంటూ స్థానిక వార్తా పత్రికలో యాడ్ ఇచ్చాడు. ‘వ్యాపారంలో నేను సర్వం కోల్పోయాను. నేను రూ. 90 లక్షల రుణా న్ని తీర్చాల్సి ఉంది. కాబట్టి నా కిడ్నీని అమ్మాలనుకుంటున్నా. కిడ్నీ అవసరం ఉన్న వారు నన్ను కాంటాక్ట్ చేయండి’ అంటూ సబ్జర్ పేపర్ యాడ్‌లో చెప్పుకొచ్చాడు. కాగా.. కశ్మీర్‌లో కరోనా కారణంగానే కాకుండా ఆర్టికల్ 370 విధింపు సమయంలోనూ ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది. ఈ కారణంగా కశ్మీర్‌లోని వ్యాపారులు ఆర్థికంగా నష్టపోయారు.