న్యూ ఢిల్లీ: సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన నిరసనలను ప్రస్తుతానికి కొనసాగించవచ్చని సుప్రీంకోర్టు గురువారం స్పష్టం చేసింది. ఢిల్లీ చుట్టుపక్కల ఆందోళనలు చేస్తున్న కర్షకులను అక్కడి నుంచి తరలించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై విచారణ జరిపింది. ‘ఆస్తి, ప్రాణ నష్టం జరగనంత వరకు నిరసనలు రాజ్యాంగబద్ధమే. కేంద్రం, రైతులు చర్చలు జరపాలి. రెండు పక్షాల వాదనలు వినేందుకు నిష్పాక్షిక, స్వతంత్ర సమితి ఏర్పాటు చేయాలని యోచిస్తున్నాం. ఆ కమిటీ చేసే సూచనలను పాటించాల్సి ఉంటుంది. అప్పటివరకు నిరసనలు కొనసాగించవచ్చ’ని స్పష్టం చేసింది.