ముంబై: రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ అర్నబ్ గోస్వామి అరెస్ట్ చుట్టూ నెలకొన్న హడావుడిని శివసేన అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలతో పోల్చింది. ‘ఎన్నికల ఫలితాలపై ట్రంప్ అసత్య వార్తలను వ్యాపింపజేస్తున్నారు. ఓట్ల లెక్కింపును నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. అమెరికా ప్రతిష్ఠను పట్టించుకోకుండా కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. ట్రంప్ లాగే మహారాష్ట్రలో భాజపా నేతలు ప్రవర్తిస్తున్నారు. ఓ అత్మహత్య కేసులో నిందితుడి అరెస్ట్కు వ్యతిరేకంగా నిరనసలు చేస్తున్నారు’అని శివసేన వాణి- సామ్నా శనివారం తన సంపాదకీయంలో వ్యాఖ్యానించింది. 53 ఏళ్ల ఇంటీరియర్ డిజైనర్ ఆత్మహత్యకు పాల్పడేలా ఉసిగొల్పారన్న కేసులో ఈ నెల 4వ తేదీన మహారాష్ట్ర పోలీసులు ఆర్నబ్ను అరెస్టు చేశారు. ఆయన అరెస్ట్ అప్రజా స్వామి కమని, దీని వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని భాజపా ఆరోపించింది. అర్నబ్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది.