హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. వెబ్ కాస్టింగ్ ద్వారా ఓట్ల లెక్కింపు ప్రక్రియను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. రెండో విడతలో మొత్తం 4,137 పంచాయతీలలో ఎన్నికల కోసం నోటిఫికేషన్లు వెలువడగా, వాటిలో 788 సర్పంచి స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మరో ఏడు సర్పంచి పదవులకు నామినేషన్లు దాఖలు కాలేదు. మిగతా 3,342 సర్పంచి స్థానాలకు ఈరోజు పోలింగ్ జరిగింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం సర్వ గ్రామంలో ఓట్ల లెక్కింపు సందర్భంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కౌంటింగ్ సిబ్బందిపై స్థానికులు దాడికి యత్నించారు. ఎన్నికల సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటమి పాలైన అభ్యర్థి మద్దతుదారులు పోలింగ్ కేంద్రంలో సామగ్రిని ధ్వంసం చేశారు. సర్వ గ్రామంలో పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ కారు దూసుకెళ్తోంది. సాయంత్రం 5.30 గంటల వరకు వెలువడిన ఫలితాల్లో తెరాస మద్దతుదారులు అత్యధిక స్థానాల్లో విజయం సాధించారు. తెరాస మద్దతుదారులు 1303, కాంగ్రెస్ 276, తెదేపా 17, భాజపా 9, సీపీఐ 2, సీపీఎం 8 పంచాయతీలను కైవసం చేసుకున్నారు. మేజర్ పంచాయతీల్లో ఫలితాలు ఆలస్యంగా వెలువడే అవకాశముంది.