ముంబై: హిందువులను కించపరిచారనే ఆరోపణపై నటుడు అమితాబ్ బచ్చన్ కు వ్యతిరేకంగా పోలీసులు బుధవారం ఇక్కడ కేసు దాఖలు చేసారు. ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కౌన్ బనేగా కరోడ్‌పతి కార్యక్రమంలో హిందువులను కించపరిచారని భాజపా శాసనసభ్యుడు అభిమన్యు పవార్ ఫిర్యాదు చేశారు. సోనీ టెలివిజన్‌లో అక్టోబర్ 30న ప్రసారమైన ఈ కార్యక్రమానికి సామాజిక కార్యకర్త బెజవాడ విల్సన్, నటుడు అనూప్ సోని అతిథులుగా వచ్చారు. కార్యక్రమంలో రూ.6.40 లక్షల నగదు బహుమతి 1927 డిసెంబర్ 25న డాక్టర్ అంబేడ్కర్, అతని అనుచరులు విష్ణు పురాణం, భగవద్గీత, రుగ్వేదం, మనుస్మృతి ల్లో దేన్ని తగుల బెట్టారని ప్రశ్నించారు. కుల వివక్ష, అస్పృశ్యతలను వ్యతిరేకిస్తూ అంబేడ్కర్, అతని అనుచరులు మనుస్మృతి ప్రతులను తగులబెట్టారని బదులిచ్చారు. ఈ ప్రశ్న హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని అమితాబ్‌పై, సోనీ ఎంటర్టైన్మెంట్పై చర్యలు తీసుకోవాలని అభిమన్యు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఈ ప్రశ్నలో ఇచ్చిన సమాధానాలన్నీ హిందూమతానికి సంబంధించిన గ్రంథాలవని, ప్రశ్నలోని ఉద్దేశం హిందువుల మనోభావాలు కించపరచడమేనని అభిమన్యు ఆరోపించారు.