రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కనిగిరి అసెంబ్లీ నుంచి పోటీ చేయనున్నట్లు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి తేల్చి చెప్పారు. తెలుగుదేశం పార్టీ నుంచి తనకు ఆహ్వనం అందిందని, పార్టీ పిలుపు మేరకు తాను రానున్న ఎన్నికల్లో పోటీకి సిద్దంగా ఉన్నానని ప్రకటించారు. తాను కూడా తెలుగుదేశంతోనే పయనించాలన్న నిర్ణయంతో ముందుగానే తన ఉద్ధేశాన్ని ముఖ్యమంత్రికి చెప్పినట్లు వెల్లడించారు. తాను తీసుకునే రాజకీయ నిర్ణయానికి ఉగ్రసేన సభ్యులు, అభిమానులు అంతా మద్దత్తు పలకడం అనందంగా ఉందన్నారు. బుధవారం కనిగిరిలోని పవిత్ర పంక్షన్‌హాలులో ఉగ్రసేన నాయకులు, అభిమానులు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నిరుద్యోగ సమస్యను గుర్తించి ఆనాడే నిమ్జ్‌ను ప్రతిపాదించి కనిగిరి ప్రాంతానికి తీసుకువచ్చానన్నారు. గతంలో తాను చేసిన అభివృద్ది కంటే తిరిగి మరింత అభివృద్ది సాధిస్తానని, ప్రతి ఇంటికి కుళాయి నీరు అందించి ప్రజల నీటి కష్టాలు తొలగిస్తానన్నారు. ఏనిర్ణయమైనా మీ వెంటే: ఉగ్రసేన నేతలుమాజీ ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన వెంటే ఉంటామని సమావేశంలో ఉగ్రసేన నాయకులు ప్రకటించి తీర్మానించారు. సమావేశానికి నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి ఉగ్రసేన అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అత్యధిక గ్రామాల నుంచి కూడా అభిమానులు హాజరుకావడం విశేషం. నియోజకవర్గంలో నూతన ఒరవడిని తీసుకొచ్చిన ఘనత ఆయనకు దక్కిందన్నారు. హాజరయిన వారిలో హనుమంతునిపాడు, వెలిగండ్ల, పీసీపల్లి మండలాల వారు ఎక్కువమంది కనిపించారు. ఆతర్వాత పామూరు, కనిగిరి నగర పంచాయతీల నుంచి అధికంగా వచ్చారు. ఇటు తెలుగుదేశంతోపాటు అటు వైసీపీ అభిమాన శ్రేణులు ఈ సమావేశానికి హాజరుకావడం విశేషం. పార్టీ రహితంగా ఉండే మేధావి వర్గానికి చెందినవారు హాజరయ్యారు. సమావేశంలో ఉగ్రసేన నాయకులు షేక్ బుడేసాహెబ్, సానికొమ్ము రాఘవరెడ్డి, అట్లా మాలకొండారెడ్డి, బోయిళ్ళ తిరుపతిరెడ్డి, కేలం ఇంద్రభూపాల్‌రెడ్డి, పిచ్చిరెడ్డి, పాల్గొన్నారు.