బొత్స సత్యనారాయణ మేనల్లుడు,విజయనగరం జిల్లా వైసీపీ సమన్వయ కర్త మజ్జి శ్రీనివాసరావును పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లాలో ఓటర్ల జాబితా సర్వే చేస్తున్నారంటూ ఓ ప్రైవేటు సంస్థ ప్రతినిధులపై వైసీపీ నేతలు దాడికి దిగారు. వారి నుంచి ట్యాబ్‌లు లాక్కున్నారు. దీంతో సర్వే ఏజెన్సీ వారు పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలో ట్యాబ్‌లను అప్పగించాలని మజ్జి శ్రీనును పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా అరెస్టుపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్వే పేరుతో ప్రభుత్వం వైసీపీ ఓట్లు తొలగించేందుకు ఈ కుట్రలకు పాల్పడుతుందని ఆరోపిస్తున్నారు.
ఈ విషయంపై వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సీరియస్ అయ్యారు. అమరావతిలో ఆయన మాట్లాడుతూ.. టీడీపీ అరాచకాలపై ఈసీకి,రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేస్తామని అన్నారు. బయట వ్యక్తులు ఓటర్ల జాబితాను ట్యాబుల్లో అప్లోడ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. నెల్లిమర్లలో సర్వేల పేరుతో తిరుగుతున్న వారిని ప్రశ్నిస్తే సరైన సమాధానం రాలేదని, ఆ వ్యక్తులను తమ కార్యకర్తలే పట్టుకుని పోలీసులకు అప్పగించారని బొత్స చెప్పుకొచ్చారు. అయితే ఆ వ్యక్తులను వదిలేసి, ట్యాబులను తీసుకెళ్లి ఫిర్యాదు చేసుకోమని స్థానిక పోలీసులే అప్పజెప్పారని బొత్స చెబుతున్నారు.