2018లో బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితం అందుకున్నాడు సల్మాన్ ఖాన్. అతడు నటించిన `టైగర్ జిందా హై` (2017) బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయం సొంతం చేసుకుంది. అయితే ఆ తర్వాత సల్మాన్ నటించిన రేస్ 3 చిత్రం భారీ బిజినెస్ చేసి తీవ్రంగా నిరాశపరిచింది. ఆ ప్రభావంతో అతడు నటిస్తున్న తాజా సినిమాపై ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడన్న ప్రచారం సాగుతోంది. `టైగర్ జిందా హై` ఫేం అలీ అబ్బాస్ జాఫర్ తిరిగి భాయ్ ని ట్రాక్ లోకి తెచ్చే ప్రయత్నంలో ఉన్నాడు. తాజాగా `భరత్` చిత్రాన్ని ఛాలెంజింగ్ గా తెరకెక్కిస్తున్నాడు. 2019 ఈద్ కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
లేటెస్ట్ గా ఈ సినిమా టీజర్ రిలీజైంది. టీజర్ లో భాయ్ సాలిడ్ డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. “చాలామంది నన్ను అడుగుతుంటారు .. నీ జాతి ఏంటి? నీ ఇంటి పేరు ఏంటి? నీది ఏ ధర్మం? అని.. అలాంటి వాళ్లందరికీ నేను చిన్న స్మైల్ ఇచ్చి .. ఇలా అంటాను! మా నాన్న నాకు భరత్ అని దేశం పేరు పెట్టారు. అలాంటి గొప్ప పేరు ముందు జాతి ధర్మం ఇంటి పేరు .. వంటివి తగిలించి నా పేరుకు కానీ ఈ దేశానికి కానీ ఉన్న గౌరవాన్ని తగ్గించలేను“ అంటూ అదిరిపోయే డైలాగ్ ని చెప్పాడు. సల్మాన్ ఈ చిత్రంలో ఓ నావీ ఆఫీసర్ గా కనిపిస్తున్నారు. అతడి లుక్ మైమరిపించింది.ఈ టీజర్ లో సల్మాన్ భాయ్ బైక్ రైడ్ అదరగొట్టేశాడు. భాయ్ లోని రకరకాల కోణాల్ని ఈ టీజర్ ఆవిష్కరించింది. టైగర్ జిందా హై లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన అబ్బాస్ అలీ జాఫర్ ఈసారి కూడా అలాంటి ఓ దేశభక్తి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని అర్థమవుతోంది. అయితే ఆ స్థాయి విజయం అందుకుంటుందా లేదా? అన్నది మాత్రం ఇప్పటికైతే సస్పెన్స్. ఈ చిత్రంలో కత్రిన కైఫ్ టబు దిశా పటానీ సోనాలి కులకర్ణి వంటి తారలు నటిస్తున్నారు. నోరా ఫతేహి ఓ గెస్ట్ రోల్ చేస్తోంది. రీల్ లైఫ్ ప్రొడక్షన్స్ – ఎస్.కె.ఎఫ్ ప్రొడక్షన్స్ తో కలిసి టీసిరీస్ భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.