జాతీయ స్థాయిలో హంగ్ తప్పదని అంటున్నాయి సర్వేలు. కాంగ్రెస్ పార్టీ కొంతవరకూ కోలుకున్నా.. సొంతంగా వంద సీట్లను కూడా ఆ పార్టీ సాధించలేదని, బీజేపీ సొంతంగా రెండు వందలకు పైగా స్థానాల్లో గెలిచినా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఉండదని.. జాతీయ సర్వేలు విశ్లేషిస్తూ ఉన్నాయి. అయితే ఇవే సర్వేలు నిజం అవుతాయని చెప్పడానికి లేదు. ఇదివరకూ సర్వేలు కొన్నిసార్లు నిజం అయినా, మరి కొన్నిసార్లు చిలక జోస్యంగానే మిగిలిపోయాయి.
అయితే కీలకమైన యూపీలో రాజకీయ పరిస్థితిలో మార్పు కనిపిస్తూ ఉంది. ఎస్పీ- బీఎస్పీల పొత్తు బీజేపీని భారీగా దెబ్బతీస్తుందని జాతీయ మీడియా అంటోంది. అయితే ఇది ఎంతవరకూ నిజం అవుతుంది? అనేది ప్రశ్నార్థకమే. యూపీలో ఎస్పీ-బీఎస్పీలు కలిసి యాభై ఒక్క ఎంపీ సీట్లను సాధిస్తాయట. గత ఎన్నికల్లో ఆ పార్టీలు సాధించిన ఓట్ల శాతాన్ని బట్టి ఈ నంబర్లను చెబుతున్నారేమో! అయితే రాజకీయాల్లో ఎప్పుడూ వన్ ప్లస్ వన్ టూ కానే కాదు. తెలంగాణలో కాంగ్రెస్-టీడీపీలు చేతులు కలిపినప్పుడు ఆ పార్టీలు స్వీప్ చేయాల్సింది. అయితే ఆ ఫలితాలు ఎలా వచ్చాయో తెలిసిందే.
ఎస్పీ-బీఎస్పీలు కూడా దశాబ్దాలుగా వైరి వర్గాలుగా చలామణి అయ్యాయి. వీరి మధ్య తీవ్రమైన ధ్వేష రాజకీయం నడిచింది. అలాంటి పార్టీలు పాతికేళ్ల తర్వాత చేతులు కలుపుతూ ఉన్నాయి. దీంతో ఆ పార్టీల శ్రేణులు కలిసి పనిచేస్తాయని చెప్పడానికి లేదు! బీజేపీని ఓడించడానికి… వీళ్లు చేతులు కలపడాన్ని జనాలు ఆమోదిస్తారా అనేది కూడా ప్రశ్న! వీళ్లు చేతులు కలపడాన్ని చూసి.. మోడీ మీద అయ్యోపాపం.. అనే ఫీలింగ్ కలిగిందంటే కథ మారిపోతుంది. అన్నింటికీ మించి యూపీ ప్రజలు గత కొన్నాళ్లుగా సంచలన ఫలితాలను ఇస్తున్నారు. లోక్ సభ గత సార్వత్రిక ఎన్నికల్లోనూ, యూపీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ యూపీ ప్రజల నాడిని మీడియా పట్టలేకపోయింది.
ఇక సౌత్ లో కాంగ్రెస్ వైపున ఉన్న డీఎంకే తమిళనాడులో స్వీప్ చేస్తుందనే అంచనా నిజమే కావొచ్చు. తమిళనాడులో అన్నాడీఎంకే పాలనపై తీవ్రమైన వ్యతిరేకత ఉంది. అసలు ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకోనే లేదు. వాళ్లు ఎన్నుకున్నది జయలలితను. ఇప్పుడు ఏలుతున్నది ఆమె కాదు. అందులోనూ ఐదేళ్లకు ఒకసారి ఒకరిని చిత్తకొట్టడం, మరొకరిని నెత్తిన పెట్టుకోవడం తమిళులకు అలవాటే. కాబట్టి తమిళనాట డీఎంకే స్వీప్ చేయడంలో పెద్ద ఆశ్చర్యంలేదు. రజనీ, కమల్ లు వస్తారని అంటున్నా, వాళ్ల కన్నా ముందు ఎన్నికలు వచ్చేస్తున్నాయి.
మినిమం మెజారిటీ రాకపోతే మోడీకి మళ్లీ ఛాన్స్ ఉండదని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు. ఎన్డీయే రూపంలో అయినా బీజేపీ మినిమం మెజారిటీని తెచ్చుకోలేకపోతే మోడీకి మళ్లీ ప్రధాని సీట్లో కూర్చునే అర్హత పోయినట్టే. వేరే వాళ్ల మద్దతు తీసుకుని నిలబడాలని చూసినా.. అది అనైతికమే అవుతుంది. అలాంటి పరిస్థితుల్లో బీజేపీలోనే మోడీ వ్యతిరేక గళం గట్టిగా వినిపించవచ్చు. తప్పనిసరిగా మోడీ తప్పుకోవాల్సి వస్తుంది. బీజేపీ నుంచినే ఎవరినైనా పీఎంగా ఎన్నుకోవాల్సి రావొచ్చు.
అయితే మోడీకి మరో ఆరువారాల సమయం ఉంది. ఈ వ్యవధిలో కీలకమైన బడ్జెట్ ను ప్రవేశ పెట్టబోతున్నారు. అందులో రైతులకు, మధ్యతరగతికి వరాలు కురిపించే అవకాశాలున్నాయి. వాటి ప్రభావం ఎంత ఉంటుందో కూడా చూడాల్సి ఉంది. ఏతావాతా ప్రస్తుత సర్వే ఫలితాలు అయితే.. అటు రాహుల్ ప్రధాని అయిపోతాడని అనడం లేదు, మోడీనే మళ్లీ అని అనడం లేదు. ఇక ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది!