చంఢిగఢ్: వ్యవసాయ ముసాయిదాల్ని వ్యతిరేకించి కేంద్ర మంత్రి వర్గం నుంచి అకాళీదళ్ పార్టీకి చెందిన ఏకైక మంత్రి హర్ సిమ్రత్ కౌర్ పదవికి రాజీనామా చేయటం పక్క రాష్ట్రమైన హర్యానా ను ప్రభావితం చేసింది. భాజపా కూటమి నుంచి బయటికి రావాలని హర్యానా ఉప ముఖ్యమంత్రి జననాయక్ జనశక్తి పార్టీ (జేజేపీ) అధ్యక్షుడు దుష్యంత్ చౌతాలాపై ఒత్తిడి పెరుగుతోంది. ‘దుష్యంత్ జీ మీరు కూడా హర్సిమ్రత్ కౌర్ బాదల్ ను అనుసరించండి. కనీసంలో కనీసం డిప్యూటీ సీఎం పదవికైనా రాజీనామా చేయండి. రైతుల కంటే మీరు మీ పదవికే ఎక్కువ అతుక్కుపోయార’ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రణదీప్ సూర్జేవాలా ఘాటుగా వ్యాఖ్యానించారు. అకాళీదళ్కు, జేజేపీకి రైతుల మద్ధతు ఎక్కువ. వ్యక్తి గతంగానూ ఈ రెండు పార్టీలకూ కుటుంబ సంబంధాలున్నాయి. దరిమిలా అకాళీదళ్ కూడా భాజపా కూటమి నుంచి బయటికి వచ్చేయాలని దుష్యంత్ పై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. వ్యవసాయ ముసాయిదాను దుష్యంత్ మొదట్లో వ్యతిరేకించారు. పార్లమెంట్ లో మాత్రం దుష్యంత్ వ్యవసాయ బిల్లును వ్యతిరేకించలేదు. పార్టీలో దుష్యంత్ పై ఒత్తిడి పెరిగినట్లు సమాచారం. పార్టీకి చెందిన ఎమ్మెల్యే దేవేందర్ బబ్లీ దుష్యంత్ పై బాహాటంగానే తిరుగుబాటు బావుటా ఎగరేశారు. మరో పది మంది ఎమ్మెల్యేలు కూడా దుష్యంత్ పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని బాంబు పేల్చారు.