న్యూ ఢిల్లీ: సరిహద్దు వివాదంలో చైనాతో రాజీ పడే ప్రసక్తే లేదని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మంగళ వారం లోక్ సభలో ప్రకటించారు. ‘1962లో లడఖ్ లో చైనా 90 వేల చదరపు కి.మీల భారత భూభాగాన్ని ఆక్రమించింది. సరిహద్దుల నిర్ణయానికి చైనా ఒప్పుకోవడంలేదు. చైనా దూకుడు చర్యలతో శాంతి ఒప్పందంపై తీవ్ర ప్రభావం పడింది. సరిహద్దు సమస్య తేలేవరకు ఎల్ఏసీని గౌరవించాలన్న నిర్ణయాన్ని చైనా ఉల్లంఘిస్తోంది. సరిహద్దులను మార్చాలన్న చైనా కుయుక్తులను మన సైన్యం తిప్పికొట్టింది. దౌత్య మార్గాల ద్వారా సమస్య పరిష్కారం కావాలన్నది తమ అభిమతం. ఆగస్టులో భారత్ ను రెచ్చగొట్టేందుకు చైనా ప్రయత్నించింది. సరిహద్దుల్లో హింసాత్మక ఘటనలకు పాల్పడింది. 1993, 96 ఒప్పందాలను ఉల్లంఘించింది. కలసి నడవాలని చైనాను కోరుతున్నాం. సార్వభౌమత్వం విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు. రష్యాలో జరిగిన సమావేశంలో చైనా రక్షణ మంత్రికి ఇదే విషయం స్పష్టం చేశామ’ని వివరించారు.