అడివి శేష్, రెజీనా కసాండ్రా, నవీన్ చంద్ర ప్రధాన పాత్రధారులుగా రూపొంది ఘన విజయం సాధించిన క్రైమ్ థ్రిల్లర్ ఎవరు కన్నడలో రీమేక్ కాబోతోంది. ఇటు ప్రేక్షకాదరణతో పాటు విమర్శకుల ప్రశంసలు అమితంగా పొందిన ఈ సినిమాలో ముగ్గురు ప్రధాన పాత్రధారుల నటన, స్క్రీన్‌ప్లే హైలైట్‌గా నిలిచాయి. ఇది స్పానిష్ థ్రిల్లర్ ‘కాంట్రాటీంపో’కు అఫిషియల్ రీమేక్. ‘ఎవరు’ కంటే ముందే ఈ సినిమా బాలీవుడ్‌లో అమితాబ్ బచ్చన్, తాప్సీ ప్రధాన పాత్రధారులుగా ‘బద్‌లా’ టైటిల్‌తో రీమేక్ అయ్యింది. అక్కడ కూడా ఈ సినిమా బాగా ఆడింది. కాగా, ‘ఎవరు’ కన్నడ రీమేక్‌లో తెలుగులో రెజీనా చేసిన క్యారెక్టర్‌ను హరిప్రియ చేయబోతోంది. ఆమె తెలుగులోనూ కొన్ని సినిమాలు చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. భూమికా చావ్లా నిర్మించిన ‘తకిట తకిట’ మూవీ ద్వారా టాలీవుడ్‌లో అడుగుపెట్టిన హరిప్రియ, ఆ తర్వాత ‘పిల్ల జమీందార్’లో నాని జోడీగా నటించి మెప్పించింది. అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్, ఈ వర్షం సాక్షిగా, గలాట సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. చివరగా బాలకృష్ణతో ‘జై సింహా” మూవీ చేసింది. ఇక అడివి శేష్ చేసిన మెయిన్ లీడ్ క్యారెక్టర్‌ను కన్నడ హీరో దిగంత్ చేయనున్నాడు. త్వరలోనే ఈ కన్నడ రీమేక్ షూటింగ్ మొదలు కానున్నది.