తిరుమల : అంతర్వేది శ్రీ లక్ష్మినరసింహస్వామి ఆలయ రథం దగ్ధం కావటంతో తితిదే అధికారులు అప్రమత్తమయ్యారు. తితిదే పరిధిలో ఉన్న ఆలయాల రథాల భద్రతకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారు, శ్రీనివాసమంగాపురం కళ్యాణవెంకటేశ్వర స్వామి, తిరుపతి గోవిందరాజ స్వామి, కోదండరామస్వామి, ఒంటిమిట్ట రామాలయంతోపాటు 19 ఆలయాలు తితిదే పర్యవేక్షణలో ఉన్నాయి. ఈ ఆలయాల్లోని కొన్ని రథాలకు భద్రత లేదని గుర్తించారు. సీసీ కెమెరాల నిఘా లేని ప్రాంతాల్లో కొత్త కెమెరాలు ఏర్పాటు చేస్తోంది. తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి ఆలయ రథం బహిరంగ ప్రదేశంలో ఉంది. చిన్న ప్లాస్టిక్ కాగితాలతో దాన్ని కప్పి ఉంచుతున్నారు. ఇప్పుడు దీని చుట్టు ఇనుప స్థంభాలతో రక్షణ వలయాన్ని ఏర్పాటు చేయనున్నారు.