నెల్లూరు జిల్లాలోని సతీశ్‌ధవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం (షార్) నుంచి గురువారం అర్ధరాత్రి నింగిలోకి పంపిన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్-సీ44 ప్రయోగం విజయవంతమైంది. బుధవారం రాత్రి 7.37 గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్ ప్రక్రియ నిరంతరాయంగా 28 గంటలపాటు కొనసాగింది. గురువారం రాత్రి 11.37 గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సీ44 నింగిలోకి దూసుకెళ్లింది. దీని ద్వారా తమిళనాడు ఉన్నత పాఠశాల విద్యార్థులు రూపొందించిన 1.2 కిలోల బరువున్న కలాంశాట్‌తోపాటు 740 కిలోల మైక్రో శాట్-ఆర్ ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. కలాంశాట్ కమ్యూనికేషన్ ఉపగ్రహం. మైక్రోశాట్-ఆర్ దేశ రక్షణ రంగ అవసరాల కోసం(డీఆర్‌డీవో) పంపారు. దీనికి డీఆర్‌డీఏ వారు పెలోడ్లను సమకూర్చారు. షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి రాకెట్ బయలుదేరాక 13 నిమిషాల అనంతరం 274 కిలోమీటర్ల ఎత్తులో మైక్రోశాట్ ఉపగ్రహాన్ని విడిచిపెట్టింది.
పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ సిరీస్‌లో ఇది 46వ వాహకనౌక. దీనిని పీఎస్‌ఎల్‌వీ-డీఎల్‌గా పిలుస్తున్నారు. సాధారణంగా పీఎస్‌ఎల్‌వీ వాహకనౌకకు ఆరు స్ట్రాపాన్ బూస్టర్లు ఉంటాయి. పీఎస్‌ఎల్‌వీ-సీ44లో మాత్రం రెండు స్ట్రాపాన్ బూస్టర్లను అమర్చారు. దాంతోనే ప్రయోగం చేపట్టారు. దీనిని దృష్టిలో ఉంచుకుని వాహకనౌకకు పీఎస్‌ఎల్‌వీ-డీఎల్‌గా నామకరణం చేశారు. వాహకనౌకలోని పీఎస్4 దశను కక్ష్యలో ఆర్బిటాల్ ప్లాట్‌ఫాంలా ఉపయోగపడేందుకు అంతరిక్షంలోనే ఉంచనున్నారు. పీఎస్4 దశలో లిథియం ఆయాన్ బ్యాటరీలు అమర్చారు. పీఎస్4 దశను ఎత్తయిన సర్క్యులర్ ఆర్బిట్‌కు పంపనున్నారు. దాన్ని అంతరిక్షంలో ఉంచి మరికొన్ని అంశాలపై అధ్యయనం చేయనున్నారు. పీఎస్‌ఎల్‌వీ-సీ44 వాహకనౌకలో బరువును తగ్గించి పరిమాణాన్ని పెంచేందుకు తొలిసారి నాలుగో దశలో అల్యూమినియం ట్యాంకును వినియోగించారు.
ఇస్రోకు వచ్చి ప్రయోగాలు చేయవచ్చుప్రయోగం విజయవంతమైన అనంతరం ఇస్రో ఛైర్మన్ డాక్టర్ శివన్ మాట్లాడుతూ.. విద్యార్థులు ఉపగ్రహాలు తయారుచేసుకుని, వాటిని ఇస్రోకు తీసుకువచ్చి ప్రయోగించవచ్చని సూచించారు. ప్రస్తుతం తమిళనాడు విద్యార్థులు తయారుచేసిన కలాంశాట్ నిర్ణీత కక్ష్యలోకి చేర్చామంటూ విద్యార్థులను అభినందించారు. సైన్స్ ప్రయోగాలపై యువత దృష్టి పెట్టి విజ్ఞాన భారతంగా మార్చాలని ఆకాంక్షించారు. |