ముంబై: జియోతో టెలికాం కంపెనీలకు కంటిమీద కునుకు లేకుండా చేశారు ముఖేశ్ అంబానీ. భారతదేశ టెలికాం చరిత్రలో ఎన్నో సంచలనాలకు తెరలేపి.. ఇంటర్నెట్ సేవలను అత్యంత చౌకగా మార్చేశారు. తనతో పాటు అన్ని కంపెనీలను అదే దారిలో నడిచేలా చేశారు. జియో దెబ్బకు కొన్ని కంపెనీలు పత్తా లేకుండా పోగా.. మరికొన్ని విలీనమైపోయాయి. భారీ మార్కెట్ సాధించిన జియోను ఢీకొట్టేందుకు.. వొడాఫోన్ – ఐడీయా లిమిటెడ్ భారీ ప్లాన్‌తో వస్తోంది. మార్కెట్‌లో జియోకి పోటీగా రూ.25వేల కోట్ల పెట్టుబడులను సిద్ధం చేసుకుంటున్నట్టు సమాచారం. దీనిలో రూ. 11వేల కోట్లను వొడాఫోన్ సమకూర్చగా.. ఐడియా రూ.7వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెడుతోంది. మిగిలిన పెట్టుబడిని ఇండస్ టవర్ లిమిటెడ్ కంపెనీలోని తమ 11.5శాతం షేర్లు అమ్మకం ద్వారా సమకూర్చుకోనున్నారు. ఉత్సాహపూరితమైన పోటీ వాతావరణాన్ని సృష్టించడమే లక్ష్యంగా ఈ పెట్టుబడులు సమీకరిస్తున్నట్టు కంపెనీ అధికారి ఒకరు తెలిపారు. మరి ఈ పోటీని ముఖేశ్ ఎలా ఎదుర్కోనున్నారో తెలియాలంటే వేచి చూడాల్సిందే.