పీయూష్ గోయల్‌కు ఆర్థిక శాఖ.. రెండు బడ్జెట్లూ ఆయనే!

పీయూష్ గోయల్‌కు ఆర్థిక శాఖ.. రెండు బడ్జెట్లూ ఆయనే!

పార్లమెంట్‌లో ఓటాన్ బడ్జెట్‌ ప్రవేశ పెట్టడానికి 10 రోజుల ముందు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్థిక శాఖ బాధ్యతలను తాత్కాలికంగా రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌కు అప్పగించారు. ప్రధాని మోదీ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బుధవారం (జనవరి 23) రాత్రి జారీ చేసిన రాష్ట్రపతి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో జైట్లీ స్థానంలో రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ఫిబ్రవరి 1న లోక్ సభలో ఓటాన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాలను చూస్తున్న అరుణ్ జైట్లీ అనారోగ్యంతో అమెరికాలోని న్యూయార్క్‌లో చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే.. బడ్జెట్ సమయానికల్లా ఆయన వస్తారని అందరూ భావించారు. కానీ, జైట్లీ రాలేని పరిస్థితిల్లో ప్రధాని మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి ఆర్థిక, కార్పొరేట్‌ వ్యవహారాల బాధ్యతలను తాత్కాలికంగా గోయల్‌కు అప్పగించారు. అరుణ్ జైట్లీ కొంత కాలంగా కిడ్నీ సంబంధిత రుగ్మతతో బాధ పడుతున్నారు. ఆయన ప్రస్తుత వయసు 66 ఏళ్లు. ఇటీవల ఆయనకు కేన్సర్ కూడా సోకినట్లు వార్తలు వచ్చాయి. చికిత్స కోసం ఆయన అమెరికా వెళ్లారు. ఏప్రిల్‌లో మూత్రపిండాలకు సంబంధించిన చికిత్స జరిగినప్పుడు కూడా జైట్లీ నిర్వహిస్తున్న శాఖలను పీయూష్ గోయల్‌కు అప్పగించిన సంగతి తెలిసిందే. పీయూష్ గోయల్ ప్రస్తుతం రైల్వే శాఖతో పాటు బొగ్గు శాఖ మంత్రిగా ఉన్నారు. వరస రైలు ప్రమాద ఘటనల నేపథ్యంలో గతేడాది సురేష్ ప్రభు.. రైల్వే మంత్రిత్వ పదవికి రాజీనామా చేశారు. దీంతో ప్రధాని మోదీ ఆ బాధ్యతలను పీయూష్ గోయల్‌కు అందజేశారు. రైల్వే మంత్రిగా లోక్ సభలో ఈ ఏడాది రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి ఆయన ఇప్పటికే సిద్ధమయ్యారు. జైట్లీ అనారోగ్యం నేపథ్యంలో పార్లమెంట్‌లో ఇక రెండు బడ్జెట్లనూ ఆయనే ప్రవేశపెట్టనున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos